sucide: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆన్‌లైన్ మోసంలో రూ. 25 లక్షలు నష్టపోయి ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా... మరో ఘటనలో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో మరో కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు బలవన్మరణాలతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.
కానిస్టేబుల్ ఆత్మహత్య... విషమంగా భార్య పిల్లల ఆరోగ్యం
సిద్దిపేటలో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణ మరణించగా.. భార్య పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అప్పులు చేసి ఆన్ లైన్ లో బెట్టింగ్ వేయడం వల్లే బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికొచ్చిన ఆయన ఆందోళనగా కనిపించగా భార్య ఆరా తీశారు. అధిక లాభాల ఆశతో బాలకృష్ణ 15 రోజుల కిందట అప్పులు చేసి.. మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని ఓ కంపెనీలో విడతలవారీగా రూ. 25 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. తరువాత కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాలకృష్ణ ఆందోళనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేదని, అందరం కలిసి చనిపోదామని భార్యను ఒప్పించాడు. ఎలుకల మందు కలిపి పిల్లలకు తాగించి తామూ తాగారు. అందరూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు స్పృహలోకి వచ్చిన బాలకృష్ణ.. భార్యాపిల్లలు ప్రాణాలతో ఉండడాన్ని గమనించాడు. మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన భార్య.. సమీపంలోని బంధువులకు ఫోన్ చేయగా.. వారొచ్చి అందరినీ సిద్దిపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ అప్పటికే మృతిచెందగా.. మానస, పిల్లలు చికిత్స పొందుతున్నారు.
ప్రాణం తీసిన పరిచయం
కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాయికుమార్ (55) స్టేషన్ ఆవరణలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నర్సాపూర్‌లో నివసిస్తున్న సాయికుమార్‌కు అదే పట్టణంలోని దివ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. దీన్ని ఆసరాగా చేసుకుని.. ఆమెతో పాటు భర్త శివకుమార్, అల్లుడు కిరణ్‌కుమార్.. సాయికుమార్‌ను వేధించసాగారు. అడిగినంత డబ్బులివ్వాలని, లేదంటే చంపేస్తామంటూ బెదిరించారు. దివ్యను సాయికుమార్ వేధిస్తున్నాడంటూ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే విషయం తీవ్రంగా మారితే.. పరువు పోతుందని సాయికుమార్ ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com