జబ్బు చేసిన కోళ్లతో కూర.. అక్కాతమ్ముళ్లు మృతి.. అమ్మ పరిస్థితి విషమం..

జబ్బు చేసిన కోళ్లతో కూర.. అక్కాతమ్ముళ్లు మృతి.. అమ్మ పరిస్థితి విషమం..
X
కోళ్ల ఫారంలో పని చేస్తూ కోళ్ల ఆరోగ్యం గురించి ఆ మాత్రం తెలుసుకోలేకపోయింది. మంచి కోళ్లను మార్కెట్‌కి తీసుకెళ్లగా మిగిలిన కోళ్లతో కూర వండింది.

కోళ్ల ఫారంలో పని చేస్తూ కోళ్ల ఆరోగ్యం గురించి ఆ మాత్రం తెలుసుకోలేకపోయింది. మంచి కోళ్లను మార్కెట్‌కి తీసుకెళ్లగా మిగిలిన కోళ్లతో కూర వండింది. అది తిన్న ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో మనీష (13), కుమారుడు కుమార్ (10) ఉన్నారు. గ్రామ శివారులోని ఒక కోళ్లఫారంలో మల్లేశ్ దంపతులు పని చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఫారంలోని కోళ్లను కొనుగోలు దారుడు తీసుకెళ్లాడు. మరికొన్ని కోళ్లు అనారోగ్యం బారిన పడ్డాయని తెలిసి వాటిని అక్కడే వదిలేశాడు. మల్లేశ్ భార్య బాలామణి ఆ కోళ్లతో కూర వండి పిల్లలకు పెట్టి తానూ తిన్నది. మల్లేశ్ భోజనం చేయలేదు. అయితే ఆ మర్నాడు ఇద్దరు పిల్లలు మనీష, కుమార్‌లు కడుపునొప్పిగా ఉందన్నారు. కొద్ది సేపటికి వాంతులు కూడా చేసుకున్నారు. దీంతో మల్లేశ్ వారిని తూఫ్రాన్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మేడ్చల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

కానీ అక్కడి వైద్యులు పిల్లలకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. దాంతో తిరిగి తూఫ్రాన్ ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా అప్పటికే మనీష, కుమార్‌లు మరణించారని వైద్యులు ధృవీకరించారు. మరోవైపు బాలామణికి కూడా కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. వెంటనే ఆమెను కొంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మల్లేశ్‌ను విచారిస్తున్నారు.

Tags

Next Story