TS: నిరుద్యోగుల మెరుపు ధర్నా

TS: నిరుద్యోగుల మెరుపు ధర్నా
X
డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌... భారీగా ట్రాఫిక్‌ జామ్‌

తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద మెరుపు ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా అశోక్‌నగర్‌ క్రాస్‌రోడ్డుకు చేరుకున్నారు. వందల మంది అభ్యర్థులు గ్రూప్‌-2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ బైఠాయించారు. అశోక్‌నగర్‌ వద్ద ఆందోళనలో ఒక యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ విద్యార్థులు నినదించారు. ధర్నా కారణంగా అశోక్‌నగర్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. డీఎస్సీ వాయిదా వేయాలనే డిమాండ్‌తో ఓయూతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌ వద్ద కూడా నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు.

కోచింగ్ సెంటర్ల పనే: రేవంత్‌రెడ్డి

తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని... కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు పోటీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని రేవంత్‌ అన్నారు. పదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని... ఇప్పుడు పక్కాగా డీఎస్సీ, గ్రూప్‌ 2, 3 నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటున్నారు. ఏ పరీక్షలూ రాయనివారు దీక్షలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్‌ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబరు 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య’కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సెప్టెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌ 2024’ లోగోను ఆవిష్కరించారు. ఏటా లక్ష మంది ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసుకొని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని భావిస్తున్నామని, అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైనది సివిల్‌ ఇంజినీరింగ్‌ అని రేవంత్‌ అన్నారు. కొన్ని కళాశాలలు ఈ కోర్సును నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఆ విద్యా సంస్థల్లో ఆ కోర్సు లేకుండా ఉండేలా పథకాలు వేస్తున్నాయని.... సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సులు కచ్చితంగా నడపాలని రేవంత్‌ అన్నారు.

Tags

Next Story