AMIT SHAH: బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం

హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17ని... తెలంగాణ విమోచనం పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకల్ని నిర్వహిస్తోంది. గత ఏడాది మాదిరిగానే సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ వేదికగా ఉత్సవాలు జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న రాత్రే అమిత్‌షా హైదరాబాద్ చేరుకున్నారు. బీజేపీ నేతలు శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పరేడ్‌గ్రౌండ్‌కు రానున్న అమిత్‌షా తొలుత పోలీస్ అమరవీరుల స్మృతి స్థల్ వద్ధ నివాళి అర్పిస్తారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి... పారామిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. తెలంగాణ విమోచన వేడుకల్లో భాగంగా కళారూపాలను ప్రదర్శించనున్నారు. బతుకమ్మ, బోనాలు, పోతురాజులు, ఒగ్గుడోలు విన్యాసాలు, కోలాటం, తప్పెట, థింసా, లంబాడ నృత్యాలను ప్రదర్శించనున్నారు.
జెండా ఆవిష్కరణ తర్వాత స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను అమిత్‌షా సన్మానించనున్నారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఎన్నికల వేళ జరుగుతున్న వేడుకల్లో అమిత్‌షా ప్రసంగంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అంతుకుముందు సీఆర్పీఎఫ్ ఆఫీసర్స్ స్టాఫ్‌మెస్‌లో బస చేసిన అమిత్ షా.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో సమావేశమై ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, CWC సమావేశాలు, పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై అమిత్ షా... తెలంగాణ నేతల వద్ద ఆరా తీశారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పడక్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలను పటిష్ఠం చేయడమే కాకుండా వారికి అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా పూర్తి చేసేలా చూడాలని సూచించారు. ఎన్నిక హామీ నెరవేర్చడంలో భారాస సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని స్పష్టంచేశారు. ఈనెల 28 నుంచ అక్టోబరు 2 వరకు రాష్ట్రంలో మూడు వైపుల నుంచి చేపట్టే బస్సు యాత్ర, హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరలో కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే బ్యాండ్మిటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో సింధు తండ్రి పీవీ రమణ కూడా పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com