తెలంగాణకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం: అమిత్ షా

భారత మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లాభాయ్ పటేల్ పరాక్రమం వల్లే హైదరాబాద్ విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్‌లోని వెయ్యి ఉరులమర్రి దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛీప్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్న అమిత్ షా... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి ఖాయమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అంచనాలకు మించి ఎంపీ సీట్లను గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను.. అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. అటు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.
అటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎంఐఎంపై విరుచుకపడ్డారు. మజ్లీస్‌ను సంతృప్తి పర్చేందుకే టీఆర్‌ఎస్ సర్కార్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటంలేదని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఎద్దేవ చేశారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన వీరుల చరిత్రను.. భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే నిర్మల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
అంతకుమందు సెప్టెంబర్ 17 నిర్మల్ సభ కోసం... కేంద్రహోం మంత్రి అమిత్ షా... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మల్ వచ్చారు. నిర్మల్ సభా ప్రాంగణంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా..ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అమిత్ షా సందర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com