Amit Shah : ఈసారి తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం-అమిత్ షా
కుటుంబ అభివృద్ధి - దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్యే ఈ సారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన...ఈసారి తెలంగాణలో 10పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదన్న షా మోదీ మాట ఇస్తే తప్పక నెరవేరుస్తారని పేర్కొన్నారు.
భువనగిరి భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలన్న అమిత్‌షా... ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం జరుగుతుందని.. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని అమిత్‌షా అన్నారు. భాజపాతోనే దేశ అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించిన అమిత్‌షా... భువనగిరి కోసం కేంద్రం చేసిన అభివృద్ధి పనులను వివరించారు.
కాంగ్రెస్,బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య బంధం ఉందని ఆరోపించారు అమిత్ షా. మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించవని గుర్తు చేశారు. రద్దు చేసిన ట్రిపుల్ తలాక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్... ఈ మూడు పార్టీలు ఒక్కటే అని చెప్పారు అమిత్ షా. వీరి మధ్య త్రికోణ బంధం ఉందన్నారు. శ్రీరామనవమి నిర్వహిస్తే ఈ పార్టీలు ఆంక్షలు విధిస్తారని అన్నారు. సీఏఏను వ్యతిరేస్తున్నారని విమర్శించారు. ఈ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మోదీ ఏది చెబుతారో అది తప్పకుండా చేస్తారన్న అమిత్‌షా రాహుల్ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదన్నారు. భాజపా అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com