KISHAN REDDY: అభివృద్దిపై చర్చకు రెడీ : సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్‌

KISHAN REDDY: అభివృద్దిపై చర్చకు రెడీ : సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్‌
X
సీఎం విమర్శలపై ఎంపీ ఆగ్రహం... మోదీని చూసి నేర్చుకోవాలని సూచన

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కాస్తా ఘాటుగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి తెలుసుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరి నువ్వు సిద్ధమా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడితే.. ఎలా అంటూ సీఎం రేవంత్ ని సూటిగా ప్రశ్నించారు. మీరు, మీ క్యాబినెట్ సహాచరులు ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై మంగళవారం క్లారిటీ వస్తుందని చెప్పారు. తెలంగాణ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజు వస్తుందన్నారు. సోమవారం నామినేషన్లు వేస్తారన్నారు. మంగళవారం నూతన అధ్యక్ష పదవిపై ప్రకటన వస్తుందని చెప్పారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.

ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్న సునీల్ బన్సల్, శోభా కర్లందాజ్లే సోమవారం రాష్ట్రానికి రానున్నారని వివరించారు. వారి సమక్షంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని గుర్తు చేశారు. తాము తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తామని.. అంతేకానీ సీఎం రేవంత్ రెడ్డి కోసం.. కాంగ్రెస్ పార్టీ కోసం తాము పని చేయబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెట్రో డీపీఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారన్నారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Tags

Next Story