T BJP: మరోసారి రాష్ట్ర సారధిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి

T BJP: మరోసారి రాష్ట్ర సారధిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి

బీజేపీ స్టేట్ చీఫ్ గా ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డిబాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ స్టేట్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, బిజేపీ నేతలు మురళీధర్ రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపి అరవింద్,మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు హాజరయ్యారు.

అంతకుముందు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఉదయం భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం అంబర్ పేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఇక బషీర్‌బాగ్‌ కనకదుర్గమ్మ దేవాలయంలో పూజలు చేసిన కిషన్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు ఆర్పించి..గన్‌పార్క్‌ నుంచి బీజేపీ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లారు.

రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు కిషన్ రెడ్డి. 1977లో రాజకీయాల్లో వచ్చిన కిషన్ రెడ్డి అప్పటి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రస్థాయిలో,జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పని చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు కిషన్‌ రెడ్డి. రాష్ట్ర విభజన తరువాత ఆయన తెలంగాణ బీజేపీ చీఫ్‌గా పని చేశారు.

గతంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా పని చేశారు. 1999లో కార్వాన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్ రెడ్డి.. తొలి ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్ పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు ఆరేళ్లపాటు పని చేశారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రెండుసార్లు వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కిషన్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మోదీ కేబినెట్ లో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు.మళ్లీ మరోసారి ఆయనపై నమ్మకం ఉంచి బీజేపీ హై కమాండ్‌ 2024 ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సారధిగా ఎంపిక చేసింది.

Tags

Read MoreRead Less
Next Story