Telangana BJP : ఈసారి ఆ కీలక పదవి తెలంగాణ బీజేపీ నేతలకేనా..?

Telangana BJP : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయతక్వం వెన్నుదన్నుగా ఉంటోంది. ఎప్పుడు ఎలాంటి అవసరం ఉందన్నా క్షణాల్లోతీర్చేస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వంపై పోరు సాగిస్తున్న నాయకత్వానికి తన వంతు సహకారాన్ని అందిస్తోంది. గతంలో ఎప్పుడో ఓసారి చుట్టుపు చూపుగా వచ్చి పోయే అగ్ర నాయకులు,జాతీయ నాయకత్వం ఇప్పుడు రాష్ట్రానికి రెగ్యులర్‌గా వచ్చి పోతున్నారు. రాష్ట్ర నాయతక్వం పిలవడేమే ఆలస్యం అన్నట్టు వాలిపోతున్నారు. ఇప్పటికే ఇందుకు అనుగుణంగా నాయకులు కూడా వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ నాయకత్వంలో దక్షిణాది నేతలకు పెద్దపీట వేస్తూ జాతీయ పార్టీలో రాష్ట్ర నాయకులకు ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
గత కొంత కాలంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ ఉత్తరాది నుంచి దక్షిణాదివైపు మళ్లింది. ముఖ్యంగా తెలంగాణపై అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 12మంది జాతీయ కార్యవర్గ సభ్యులను నియమించింది. జాతీయ ఉపాధ్యక్ష పదవినీ కట్టబెట్టింది. పార్టీలో కొత్తగా చేరిన వారికి సైతం వారి సామర్థ్యానికి తగ్గ పదవులు కట్టబెడుతూ నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు జాతీయ నాయకులు.. ఇందులో భాగంగానే మొదటిసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేయడం, రాష్ట్ర పార్టీలో సీనియర్ నేత లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతోపాటు రాజ్య సభ సీటు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఎన్నికల కమిటీలో మెంబర్ గా నియమించారు.. సీనియర్ నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టడం ద్వారా రాష్ట్ర బీజేపీ కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. పాదయాత్ర ద్వారా బండి సంజయ్ అగ్రనాయకత్వం దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఎన్ఈసీ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి మోదీకి బండి సంజయ్ మరింత దగ్గరయ్యారనే చర్చ కూడా సాగుతోంది. పాదయాత్ర ద్వారా పార్టీని ప్రజలకు చేరువ చేయడంతో సక్సెస్ అయిన బండి సంజయ్ పనితీరును జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సభావేదికలపై ముఖ్య నాయకులు ప్రస్తావిస్తున్నారట.. దీంతో రాష్ట్ర కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొందని బీజేపీ వర్గాల టాక్. ఇదే దూకుడు కొనసాగించి ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జాతీయ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తున్నారట.
రాష్ట్రంలో పార్టీకి ప్రజల నుంచి వస్తున్న స్పందనతో జాతీయ నాయకత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష పదవి సైతం రాష్ట్ర నాయకులకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా పదవీ కాలం ముగిసిన తరువాత కొత్త అధ్యక్షుడి రేసులో తెలంగాణ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖలను తెలంగాణకే చెందిన సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్‌కు కేటాయించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
బీసీలకే పెద్ద పీట వేస్తున్నామనే సంకేతాలు ఇవ్వాలనుకుంటే లక్ష్మణ్‌నే అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయన చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చామని భావిస్తే తమిళనాడుకు చెందిన నేతను అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ జాతీయ నాయకుల నిర్ణయాలు రాష్ట్ర నాయకులకు అనుకోని పదవులు తెచ్చిపడుతుండటంతో సీనియర్ నేతలు తెగ ఖుషీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com