UREA: యూరియా తెప్పించి మాట్లాడు: తుమ్మల

తెలంగాణలో యూరియా కొరతపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరు వరకు మా వాటా యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెలా యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి అడిగారని గుర్తుచేశారు. కేవలం యూరియా కోసం ఒక అధికారిని ఢిల్లీలోనే పెట్టామని అన్నారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉంది.. కేవలం తెలంగాణలోనే సమస్య ఉందనడం సరికాదని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాంచందర్‌రావుకు పలుకుబడి ఉంటే యూరియా తెప్పించాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కాగా, అంతకుముందు రాష్ట్రంలో యూరియా బఫర్ స్టాక్ గురించి ఎందుకు చెప్పడం లేదని రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. మీ వద్ద బఫర్ స్టాక్ ఉంచుకుని, కేంద్రం యూరియా ఇవ్వడం లేదని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అని మండిపడ్డారు.
యూరియా ఇచ్చిన పార్టీకే మద్దతు: కేటీఆర్
తెలంగాణ రైతులకు కావాల్సిన రెండు లక్షల టన్నుల యూరియాను సెప్టెంబరు 9లోపు ఇచ్చిన పార్టీ అభ్యర్థికే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఇంతవరకు తమను ఏ కూటమీ సంప్రదించలేదని, అయితే తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత, అనుభవలేమి, ప్రణాళికారాహిత్యంతోనే తెలంగాణలో యూరియా కొరత తీవ్రమైంది. ఎరువులను కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలపై కేంద్రం సమగ్ర దర్యాప్తు జరపాలి. 70 లక్షల మంది తెలంగాణ రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే... కాంగ్రెస్, బీజేపీ ఎలక్షన్లు, కలెక్షన్లు అని నాటకాలు ఆడుతున్నాయి. ఎరువుల కొరతపై సీఎం రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి. లేదంటే పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com