V.C. Sajjanar: ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్

ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడుతున్న యువత తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో కొందరు యువత లక్షలకు లక్షలు బెట్టింగులు పెడుతూ నిలువునా మోసపోతున్నారు. ఆ తరువాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం చోటు చేసుకున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ ల జోలికి వెళ్లొద్దని యువతలో అవగాహన కల్పిస్తున్నా.. కొందరి తీరులో మార్పు రావడం లేదు. తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆన్‌లైన్ బెట్టింగ్ కూపంలో పడొద్దంటూ హెచ్చరిక చేశారు. ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు అంటూ పేర్కొన్నారు.
సజ్జనార్ వీడియోను షేర్ చేసి యువతకు సూచనలు చేశారు.. ‘అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు.. ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు. తమ స్వలాభంకోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ.. వారి ప్రాణాలను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శక్తులే. యువకుల్లారా.. ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయమాటల్లో పడకండి!! బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. మీ కష్టాన్ని నమ్ముకోండి. విజయం దానంతట అదే మీ దరికి చేరుతుంది’ అంటూ సజ్జనార్ పేర్కొన్నారు.
సజ్జనార్ షేర్ చేసిన వీడియోలో.. ఓ యువకుడు మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఈజీగా డబ్బులు ఎలా సంపాదించొచ్చో చూడండి అంటూ చెబుతాడు. వీడియో చూసేవారు నమ్మే విధంగా గది నిండా బెడ్ పై రూ.500 నోట్లు వెదజల్లటంతో పాటుగా తన ఖరీదైన ఐఫోన్ ను లైవ్ లో పగులగొట్టి ఆ ఫోన్ కొనేందుకు కావాల్సిన డబ్బు క్షణాల్లో సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఓ బెట్టింగ్ యాప్ లో 20వేలు పెట్టుబడి పెట్టి కేవలం ఐదు నిమిషాల్లో రెండున్నర లక్షలు సంపాదిస్తాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అవుతుంది. ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్.. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయమాటల్లో పడి మోసపోవద్దు అంటూ యువతకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com