Vemulawada : శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Vemulawada : శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
శివరాత్రి రోజు జాగరణ చేసే భక్తుల కోసం శివార్చన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ప్రభుత్వం, ఆలయ అధికారులు.. 3.3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంటున్నారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. విద్యుదీపాలంకరణలో శివరాత్రి శోభ సంతరించుకుంది. ఇప్పటికే పలుమార్లు సమీక్షించిన మంత్రి కేటీఆర్.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వేములవాడలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు వస్తారని ఆలయ అధికారులు చెప్తున్నారు. 400లకు పైగా వసతి గదులు సిద్ధం చేశారు. గుడి చెరువు మైదానంలో భక్తులకు సరిపడా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే తాగునీటి వసతి, స్నానాల ఘాట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శివరాత్రి రోజు జాగరణ చేసే భక్తుల కోసం శివార్చన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మహా శివరాత్రి మహోత్సవాలకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలను ఆహ్వానం పలికారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా మరింత వైభోపేతంగా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే భక్తుల కోసం 4 లక్షల లడ్డూలు, 10 క్వింటాళ్ల పులిహోర సిద్ధం చేసినట్లు చెప్పారు. శివరాత్రి ఉత్సవాల కోసం ఆర్టీసీ అధికారులు 850 ప్రత్యేక జాతర బస్సులు, 24 గంటల పాటు 14 మినీ ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది.

మహ శివరాత్రి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. వేములవాడలో 11 అత్యవసర వైద్యకేంద్రాలు, 163 మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే వేములవాడకు వచ్చే అన్ని దారులలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేసామన్నారు.

రాత్రి 9 గంటల నుండి రాజన్న ఆలయంలో నిశీపూజ ఉంటుంది. అనంతరం అన్ని పూజలను రద్దు చేసి కేవలం భక్తుల సౌకర్యార్థం లఘు దర్శనం, కోడె మొక్కుబడి నిర్వహిస్తారు. తెల్లవారుజామున 3.30 నిమిషాల నుండి 4 గంటల వరకు ఆలయం శుద్ధి, మంగళ వాయిద్యాలు ఉంటాయి. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటల నుండి 4.25 వరకు సుప్రభాత సేవ, ఉదయం 4.25 నుండి 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుంది. ఉదయం 7 గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఉదయం 8 గంటలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు.

రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు పురజనులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి శివదీక్ష స్వాముల దర్శనం, 6.05 నిమిషాలకు శ్రీస్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 నిమిషాలకు లింగోధ్భవ కాలమందు శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు.


Tags

Next Story