VEMULAWADA: వేములవాడ రాజన్న మొక్కులు భీమన్నకు

దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రల్లో ఒకటి. ఆలయంలోని ప్రధాన దైవం రాజరాజేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారని భక్తుల విశ్వాసం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలనుంచి కూడా వేలాదిగా భక్తులు దర్శనాల కోసం వస్తుంటారు. ప్రతి రోజు భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఆలయాన్ని ఆదివారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి అలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారికి సమర్పించే అన్ని రకాల ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కేవలం ఏకాంత సేవలు మాత్రమే నిర్వహించటం జరుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులందరూ దీనికి సహకరించాలని అధికారులు కోరారు. అయితే రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాల నిలిపివేత కొన్ని నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బండి సంజయ్ వార్నింగ్
వేమువాడ రాజన్న దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేయడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆలయం మూసివేస్తే పంచలు కట్టుకుని వచ్చి మరీ ఆలయం తలుపులు తెరుస్తామన్నారు. ఫైరింగ్ చేస్తారో లాఠీచార్జి చేస్తారో చూద్దామని చెప్పారు. ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని ఆలోపు ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com