VICE PRESIDENT: రసవత్తరంగా "ఉప రాష్ట్రపతి" రాజకీయం

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు కానున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈక్రమంలో ఎన్డీఏ కూటమి తరుఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఉంటుందా, ఉండదా అనే సందేహాలకు చెక్ పెడుతూ ఇండియా అలయన్స్ తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఇద్దరు బలమైన ప్రొఫైల్ కలిగిన అభ్యర్థుల మధ్య జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరుఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణ భారతదేశం నుంచి సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన ఆయన ఓబీసీ వర్గానికి చెందినవారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న ఎన్నికలకు ఈయన ఎంపికను ఓ రాజకీయ ఎత్తుగడగా కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణ భారతదేశానికి చెందిన జస్టిస్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈయన తెలంగాణకు చెందిన వారు. ఈ ఎంపికే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. తెలుగు వ్యక్తి కాబట్టి భేషరత్తుగా మద్దతు తెలపాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. దీనిపై పార్టీల స్పందన ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
బాబు, కేసీఆర్ సహకరించాలి: రేవంత్
ఉప రాష్ట్రపతి అభ్యర్థి గెలుపుకోసం మాజీ సీఎం కేసీఆర్‌ను కలుస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సమాధానం ఇచ్చారు. ‘‘ఇండియా కూటమి నేతలు చెబితే కేసీఆర్‌ను కలుస్తా. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు నేనే వెళ్లి కలిశాను. కానీ, ప్రస్తుతం అపాయింట్మెంట్ ఇస్తారో.. లేదో తెలియదు. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆత్మప్రభోదానుసారం ఓట్లు వేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్వవస్థలను ఎన్డీయే అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒక వైపు.. రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరో వైపు. పీవీ నరసింహారావు తర్వాత తెలుగువాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం మనకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటి మీదకు రావాలి. తెదేపా, వైకాపా, భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం సహా అన్ని పార్టీలు.. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలపాలి. చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి. ఆనాడు ప్రధాని పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారు. తెలుగువాడు అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో సహకరించారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తితో సహకరించాలి. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. న్యాయమూర్తిగా, లోకాయుక్తగా దేశానికి సేవలందించారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
స్పందించిన కేటీఆర్
ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సర్వ స్వతంత్ర్యమైన పార్టీ అని స్పష్టం చేశారు. " మాకు ఢిల్లీలో బాస్‌లు లేరు.. ఏ పార్టీ కూడా మాకు బాస్‌లు కారు.. మాకు తెలంగాణ ప్రజలే బాస్‌లు తప్ప.. మాకు ఢిల్లీలో పెద్దలు, ఆదేశించేవారు ఎవరూ లేరు." అని కేటీఆర్ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మాకు ఏ పార్టీ, అభ్యర్థులు కానీ మమ్మల్ని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోందని, కేవలం మీడియాలో చూసేదాకా తెలియదన్నారు. ఎన్నికపై మమ్మల్ని ఎవరూ కూడా సంప్రదించలేదు.. ఎన్నికకు ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. బీఆర్ఎస్ నేతలు కలిసి ఆలోచించుకోని ఎలక్షన్ సమయానికి మా వైఖరి ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బీసీల విషయంలో మా పార్టీ చిత్తశుద్ధి ఉందని చెప్పి.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక్క బీసీ అభ్యర్ధి దొరకలేదా? అని నిలదీశారు. సామాజిక వేత్త కంచె ఐలయ్యను అభ్యర్థిగా పెట్టి మీ చిత్తశుద్ధి నిరుపించుకోవాల్సిందని సూచించారు. మరోవైపు షర్మిల కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగువారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్, పవన్ ను ఆమె కోరారు. ఇది కేవలం రాజకీయాల అంశం కాదని, ఒక తెలుగువాడి ప్రతిభకు గౌరవం ఇవ్వడం కోసం అందరూ ఏకమవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com