TS: "కాళేశ్వరం"పై విజిలెన్స్ విచారణలో ఆసక్తికర అంశాలు

కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విస్తుపోయి నిజాలు తేలుతున్నాయి. ప్రాజెక్టు పూర్తైనట్లు ఇంజినీర్లు ధ్రువీకరణ పత్రం జారీచేశారు. అయితే నిర్మాణ సంస్థలకి రాసిన లేఖలో మాత్రం పెండింగ్ పనుల గురించి ప్రస్తావించడం విశేషం. సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా పనిపూర్తైనట్లు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. కానీ కుంగిన మేడిగడ్డ బ్యారేజీ ప్రత్యేకత వేరు. ఆ పని చేసిన గుత్తేదారుకు ఏకంగా మూడుసార్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇంజినీర్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు వాటికి కొనసాగింపుగా గుత్తేదారుకు రాసిన లేఖలకు పొంతనలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి నిర్వహించే సమీక్షల్లో ఇంజినీర్లు చెబుతున్నదొకటి కాగా రికార్డుల్లో ఉన్నది ఇంకొకటి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో అలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తైనట్లు ఇంకా ధ్రువీకరణపత్రం ఇవ్వలేదని సంబంధిత ఇంజినీర్లు చెప్పారు. ఐతే2020 నవంబరు 11న కాళేశ్వరం ఇంజినీర్ ఇన్‌చీఫ్ వెంకటేశ్వర్లు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ మొదలైందని పేర్కొన్నారు ఆ సమయంలో ఏమైనా లోపాలు ఉంటే చేపడతామని గుత్తేదారుసంస్థ ఎల్ అండ్ టీ అండర్‌టేకింగ్ ఇచ్చిందని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రాజెక్టు ENC రాసినలేఖ ప్రకారం 2020 ఫిబ్రవరి 29కి పని పూర్తైంది. అంతకుముందే 2019 సెప్టెంబరు 10న బ్యారేజీ నిర్మాణం దాదాపు పూర్తైందని ఆపరేషన్‌లోకి వచ్చిందని సర్టిఫికెట్ ఇచ్చారు. పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిర్మాణ సంస్థకు మరోసారి 2021 మార్చి 15న సర్టిఫికేట్ ఇవ్వగా సంబంధిత SE సంతకంచేశారు. ఆ విధంగా మూడుధ్రువీకరణ పత్రాలిచ్చారు.
2022 ఏప్రిల్ 28న నిర్మాణ సంస్థకు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాసినలేఖలో ఒరిజినల్ ఒప్పందంలోని ఐదు పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు రాశారు. 2022 ఏప్రిల్ నాటికి పనులు పెండింగ్‌లో ఉంటే 2020లోనే పూర్తై...... డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ ప్రారంభమైనట్లు ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్‌చీఫ్ ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించారు?2021 మార్చిలో పనిపూర్తైనట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏడాది తర్వాత ఒప్పందంలోని ఐదుపనులు పెండింగ్‌లో ఉన్నట్లు మళ్లీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పొంతనలేని లేఖలపై విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తే ఇంజినీర్లు నీళ్లునమిలినట్లు తెలిసింది. మేడిగడ్డబ్యారేజీ నిర్వహణకు సంబంధించిన నిర్వహణ రిజిస్టర్ ప్రాజెక్టు ఇంజినీర్ల వద్ద ఉండాలి. ఆ రిజిస్టర్ కావాలని విజిలెన్స్ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిగితే రిజిస్టర్ ఇవ్వాలనిగుత్తేదారుకు మేడిగడ్డ బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com