TS: కాళేశ్వరంపై విజిలెన్స్‌ విచారణ

TS: కాళేశ్వరంపై విజిలెన్స్‌ విచారణ
రాజీవ రతన్‌ పర్యవేక్షణలో విచారణ... ఇంజనీరింగ్‌ అధికారులను విచారించిన అధికారులు...

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ ఆదేశాలతో విజిలైన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ కొనసాగిస్తోంది. ఆ శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ రతన్ పర్యవేక్షణలో భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని హరిత హోటల్లో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌కు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులను విచారించారు. పలు అంశాలపై సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు కొన్ని ఫైళ్లు, హర్డు డిస్కులు ఎక్కడ ఉన్నాయనే అంశంపై ఆరా తీసినట్లు తెలిసింది. అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో కుంగిన పియర్స్, పరిసరాలు సహా బ్యారేజీ దిగువ భాగంలో డీజీ రాజీవ్ రతన్ స్వయంగా కిందకు దిగి పరిశీలించారు.అక్కడి నుంచి కాళేశ్వరానికి చేరుకుని మరోసారి హరిత హోటల్లో సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఈ విచారణ ప్రాంతానికి స్థానిక పోలీసులను కూడా అనుమతించడం లేదు.


మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ నుంచి బుంగలు రాకుండా మరమ్మతు పనులను నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ పూర్తి చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో భారీ వర్షాలకు వచ్చిన వరద ఉధృతికి అన్నారం బ్యారేజీ 38, 28 ఔట్లెట్ల వద్ద బుంగలు ఏర్పడ్డాయి. అవి ఏర్పడిన వెంటనే అప్రమత్తమైన అధికారులు స్టోన్, మెటల్, ఇసుకతో తాత్కాలిక ట్రీట్ మెంట్ చేసి లీకేజీని అదుపు చేశారు. బుంగల నుంచి ఇసుక బయటకు పోకుండా.. చర్యలు చేపట్టింది. తర్వాత గ్రౌటింగ్ చేయించాలని నిర్ణయించగా బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ హిమాచల్ ప్రదేశ్ నుంచి హెలిక్యాప్టర్ లో పాలీ యూరిత్రిన్ అనేరసాయానాన్నితెప్పించి ఆ పనులు పూర్తి చేసింది. ఆప్కాన్స్ సంస్థకు చెందిన 25 మంది నిపుణులు 28, 38 ఔట్ లెట్ల వద్ద గ్రౌటింగ్ పనులను పర్యవేక్షించారు. ఈ మేరకు అన్నారం బ్యారేజీలో రెండు పియర్స్ వద్ద బుంగలకు మరమ్మతు పూర్తైనట్లు ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.


ఎరువుల కొరత రానివ్వదు; మంత్రి

ఇంకోవైపు రైతులకు ఎరువుల కొరత ఎట్టి పరిస్థితిలో రానీయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎరువులను ముందుగానే గ్రామస్థాయి వరకు చేర్చేందుకు నోడల్ ఫెడ్, ఎరువుల కంపెనీలతో కలిసి ప్రణాళికలు చేయాలన్నారు. యాసంగి సీజన్ కు ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, నాలుగున్నర లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. డీసీసీబీ, పీఏసీఎస్ లలో రుణ బకాయిలను వసూలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయేతర రుణాలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రుణ వసూళ్లు చేయని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు కొత్త రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. పీఏసీఎస్ లలో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. పాక్స్ సంఘాలను బలోపేతం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎరువులు, సహకార రుణాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story