లోక కళ్యాణార్థం టీవీ5 ప్రధాన కార్యాలయంలో విజయచాముండీ హోమం

టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. శరనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజు శ్రీ విజయచాముండీ హోమాన్ని నిర్వహించారు.. హైదరాబాద్‌లోని టీవీ5 ప్రధాన కార్యాలయంలో వేదపండితులు ఆగమోక్తంగా, శాస్త్రోక్తంగా క్రతువును నిర్వహించారు. విజయ చాముండీ హోమం కోసం 108 రకాల విశేష ద్రవ్యాలను వినియోగించారు.
లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ, కరోనా మహమ్మారి పీడ విరగడి కావాలని కోరుతూ నిర్వహించిన ఈ విజయ చాముండీ హోమంలో టీవీ5, హిందూ ధర్మం ఛానెళ్ల ఛైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. హోమం అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో హిందూ ధర్మం మ్యాగజైన్ గౌరవ సంపాదకులు విజయలక్ష్మి, ఎండీ రవీంద్రనాధ్, వీసీ సురేంద్రనాధ్ సతీ సమేతంగా పాల్గొన్నారు.. మేనేజ్‌మెంట్ సభ్యులతోపాటు కార్యాలయ సిబ్బంది హోమంలో పాల్గొని అమ్మవారిని శరణు వేడారు..
లోక రక్షయైన అమ్మవారి స్వరూపాల్లో చాముండి అవతారం ఒకటి.. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూలమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కెండేయ పురాణం చాముండి మహత్యాన్ని వివరిస్తుంది.. ఎక్కడ అమ్మవారి ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు.. దుఃఖం అనేది కనిపించదు.. కలియుగంలో దుర్గామాత పారాయణకు మించిన శక్తివంతమైన ఫలదానం మరొకటి లేదని పండితులు చెబుతారు. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతలకు, భయభీతులు తొలగిపోవడానికి, శత్రుసంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి.. ఇలా అనేక కారణాలతో విజయ చాముండీ హోమం నిర్వహిస్తారు.
మొదట హోమం చేసే ప్రదేశంలో కలశంలో ఉన్న దేవతా మూర్తుల శక్తిని విగ్రహంలోకి ఆవాహనం చేశారు.. అనంతరం నెయ్యితో కలిపి ద్రవ్యాన్ని ఆహుతిలిస్తూ హోమాన్ని నిర్వహించారు.. హోమం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com