Krishna River: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం, సాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

Krishna River: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం, సాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
X
ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద నీరు

ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.40 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 298.58 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,54,831 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దిగువకు 3,14,761 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి కూడా వరదనీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి 3.93 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. జలాశయంలో ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా మరో 64,338 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదలవుతోంది.

Tags

Next Story