తెలంగాణాలో పండిన మక్కలను కొనుగోలు చేస్తాం : ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణాలో పండిన మక్కలను కొనుగోలు చేస్తాం : ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణాలో పండిన మక్కలను కొనుగోలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను కొనుగోలు చేస్తామని స్పష్టంచేశారు..

తెలంగాణాలో పండిన మక్కలను కొనుగోలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను కొనుగోలు చేస్తామని స్పష్టంచేశారు. క్వింటాలుకు 1850 రూపాయల మద్దతు ధర చెల్లించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం పంటల కొనుగోలు, యాసంగి పంటల సాగు విస్తీర్ణంపై ముఖ్యమంత్రికేసీఆర్ అధికారులతో సమీక్షించారు.

రాష్ట్రంలో మక్క పంటసాగు, మద్దతు ధరపై అధికారులతో సీఎం సమీక్షించారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదని, అందుకే సాగు చేయొద్దని ప్రభుత్వం ముందుగా తెలిపిందన్నారు. అయినా రైతులు మక్కలు సాగుచేశారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పంట కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేకున్నా.. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. గత యాసంగిలో మార్క్‌ఫెడ్ 9 లక్షల టన్నుల మక్కలను 1668 కోట్లు ఖర్చుచేసి.. రైతుల నుంచి కొనుగోలు చేసిందని.., ఐతే.. బయట మార్కెట్లో మక్కలకు ధర లేకపోవడంతో వేలం వెయ్యాల్సివచ్చిందన్నారు. దీనివల్ల కేవలం 823 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. మార్క్ ఫెడ్‌కు 845 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో మక్కలు సాగు చేయవద్దని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. మళ్లీ ఎవరైనా మక్కలు సాగు చేస్తే ప్రభుత్వం బాధ్యత లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ది కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. రైతుల సంక్షేమమే పరమాధివగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులను సంఘటిత శక్తిగా మలిచి, సమన్వయ పరిచి దేశంలోనే మొదటిసారిగా నిర్ణీత పంటల సాగు విధానం అమలు చేస్తున్నామన్నారు. ఎవరూ అడగక ముందే... ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల భూముల వద్ద లక్ష కల్లాల నిర్మాణం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 2 వేల 6 వందల రైతు వేదికలను నిర్మిస్తుందని కేసీఆర్ వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేకనే మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ధరణి పోర్టల్ ప్రారంభ తేదీలను ప్రకటించారు. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story