Telangana Temperature: తెలంగాణ వాసులకు హీట్ అలర్ట్.. వరుసగా రెండు రోజులు..

Telangana Temperature: తెలంగాణలో ఇవాళ, రేపు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ రెండు రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఆరేడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. నిన్న పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, నల్లగొండలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇది సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువ. గత పదేళ్లలో మార్చి నెలలో నల్గొండ పట్టణంలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. 2016 మార్చి 23న అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా ఈ స్థాయి వడగాడ్పులు మే నెలలో గానీ రావు. కానీ, ఈ ఏడాది మాత్రం మార్చిలోనే వీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతం నుంచి తెలంగాణలోకి గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వేడి కారణంగా గాలిలో తేమ అసాధారణ స్థాయిలో తగ్గి పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోతలు అధికమయ్యాయని వాతావరణ కేంద్రం చెబుతోంది.ఇక ఈ నెల 19, 20 తేదీల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి.
ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి భద్రాచలం, మెదక్ జిల్లాల్లో నిన్న 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, ప్రజలు ఎండలో తిరక్కపోవడమే మంచిదని వాతావరణశాఖ సూచించింది. సాధారణం కన్నా ఆరేడు డిగ్రీలు అదనంగా ఎండల తీవ్రత పెరగడంతో ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com