KCR: కేసీఆర్‌ అత్యవసర సమావేశం వెనక రహస్యం అదేనా?

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR: కేసీఆర్‌ అత్యవసర సమావేశం వెనక అసలు రహస్యం ఏంటి? రేపు తెలంగాణ భవన్‌లో మీటింగ్ తరువాత తేల్చబోయేదేంటి?

KCR: కేసీఆర్‌ అత్యవసర సమావేశం వెనక అసలు రహస్యం ఏంటి? రేపు తెలంగాణ భవన్‌లో మీటింగ్ తరువాత తేల్చబోయేదేంటి? నిజంగా ధాన్యం కొనుగోళ్లపై పోరాటానికా? అంతకు మించా? కేసీఆర్‌ వేస్తున్న ప్రతి అడుగు, చేస్తున్న ప్రతి చర్య.. ముందస్తు ఎన్నికల సంకేతాలే ఇస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిన్నటి హడావుడి చూసి మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని భావించారు.

కాని, టాపిక్ ధాన్యం కొనుగోళ్లపైకి మళ్లింది. కేంద్రం దిగొచ్చి తెలంగాణ ధాన్యం మొత్తం కొనేంత వరకు పోరాడాల్సిందేనని నిర్ణయించారు. ఈ మీటింగ్‌కు కొనసాగింపుగా రేపు తెలంగాణ భవన్‌లోనూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు కేసీఆర్. అయితే, వరి కొనుగోళ్ల పోరుబాట వెనక కూడా రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి గ్రామాల్లోనే ఎక్కువ పట్టు ఉంది.

మరీ ముఖ్యంగా రైతుల మద్దతు పుష్కలంగా ఉంది. రైతు బంధు, రైతు రుణమాఫీ హామీతో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది టీఆర్‌ఎస్ పార్టీ. అయితే, ఈసారి రైతుల నుంచే వ్యతిరేకత రావొచ్చని కేసీఆర్‌కు ఓ రిపోర్ట్‌ అందినట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీ అనుకున్నట్టుగా సాగడం లేదు. పైగా ఈసారి వరి ధాన్యం సాగు పెరిగింది. యాసంగిలో వరి వేయొద్దని కేసీఆర్‌ పిలుపు ఇచ్చినా సరే రైతులు వినలేదు.

రేప్పొద్దున ఈ పంటను కొనకపోతే కేసీఆర్‌ ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం మరింత పెరుగుతుంది. ఈ ఆగ్రహం నుంచి తప్పించుకోడానికి కేంద్రంపై పోరాడాలని నిర్ణయించుకుంది టీఆర్ఎస్‌ పార్టీ. పైగా కేంద్ర బీజేపీతో పోరాడడం వల్ల టీఆర్ఎస్‌కు కూడా లాభిస్తుందనే లెక్కలు వేస్తున్నారు గులాబీ బాస్. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చితేనే మరోసారి అధికారంలోకి వస్తామనే రిపోర్టులు కేసీఆర్‌కు అందినట్టు తెలుస్తోంది.

పీకే టీమ్‌ నుంచి వచ్చిన కొన్ని రిపోర్టులు కూడా ఇవే చెబుతున్నాయని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలంటే.. తెలంగాణలో త్రిముఖ పోరు నడవాలి. కాంగ్రెస్‌కు ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీని మరింత బలపరిస్తే తెలంగాణలో మూడు పార్టీల మధ్య పోరు నడుస్తుంది. అలా జరగాలంటే వరిపై పోరుబాట నడపాల్సిందేనన్న అభిప్రాయానికొచ్చినట్టు కనిపిస్తోంది.

తెలంగాణలో ఈసారి ముందస్తు ఎన్నికల ముచ్చటే ఉండదని కేసీఆర్ పదే పదే చెప్పారు. కాని, పార్టీ శ్రేణులు మాత్రం అలా అనుకోవడం లేదు. ఉన్నట్టుండి 80వేలకు పైగా ఉద్యోగాలు ప్రకటించడం, రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరపాలని ఆదేశించడం ముందస్తు ముచ్చటేనని చెబుతున్నారు. ఆల్రడీ ప్రతిపక్షాలు కూడా ఇదే విషయం చెప్పాయి. కేసీఆర్ మదిలో ముందస్తు ఎన్నికల ఆలోచన ఉందని, అసెంబ్లీ సెషన్స్‌లోనే ఉద్యోగాలు ప్రకటిస్తారని ముందుగానే చెప్పారు.

అనుకున్నట్టుగానే సీఎం కేసీఆర్ సభలో ప్రకటన చేశారు. అటు రైతుల విషయంలో పోరాటం, ఇటు నిరుద్యోగుల్లో అసంతృప్తి చల్లార్చడం ఈ రెండు మేజర్‌ స్టెప్స్‌ అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేయడానికి.. వచ్చే ఏడాది గుజరాత్, కర్నాటకలో జరగబోయే ఎన్నికలు కూడా కారణం అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిని తన ఖాతాలో వేసుకుంది బీజేపీ.

గుజరాత్, కర్నాటకలోనూ బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తే ఆ ఎఫెక్ట్‌ తెలంగాణపైనా పడుతుందనే అంచనాల్లో ఉన్నారు. అందుకే, ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నట్టు చర్చ నడుస్తోంది. పైగా ముందస్తుకు సర్వసన్నద్ధంగా ఉంది టీఆర్‌ఎస్. ఆ పరిస్థితి కాంగ్రెస్‌, బీజేపీకి లేదనే చెప్పాలి. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే తలమునకలో కాంగ్రెస్‌, బీజేపీ ఉంటే.. ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే ప్రిపరేషన్‌లో టీఆర్‌ఎస్‌ ఉంటుందని.. ఇది తమ పార్టీకే అడ్వాంటేజ్‌ అవుతుందనే అభిప్రాయాన్ని టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే, పొలిటికల్‌ సర్కిల్‌లో మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. కేసీఆర్‌ అవినీతిని బయటపెడతామని బీజేపీ పదేపదే హెచ్చరిస్తుండడంతో.. కేంద్ర దర్యాప్తు సంస్థలేమైనా మీద పడతాయా అన్న భయం కూడా టీఆర్‌ఎస్‌లో ఉందనే వాదన ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే.. కేంద్ర దర్యాప్తు సంస్థలు లాంటివి వచ్చినా.. అది టీఆర్‌ఎస్‌కే ప్లస్ అవుతుంది. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎన్నికల్లో చెప్పుకోవచ్చు. అందుకే, ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story