Cloud Burst : కేసీఆర్ అన్నట్లుగా క్లౌడ్ బరస్ట్‌ను కృత్రిమంగా సృష్టిస్తున్నారా..?

Cloud Burst : కేసీఆర్ అన్నట్లుగా క్లౌడ్ బరస్ట్‌ను కృత్రిమంగా సృష్టిస్తున్నారా..?
Cloud Burst : క్లౌడ్ బరస్ట్ సహజమే కానీ కృత్రిమంగా జరిపారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Cloud Burst : వానలు వస్తున్నాయి. వానల వెనుక వరదలు వస్తున్నాయి. కానీ ఈ మధ్య ఆ వరదల వెనుక ఒక పదం వినిపిస్తోంది. అదే క్లౌడ్ బరస్ట్.. లాస్ట్ వీక్‌లో అమర్‌నాథ్‌లో వచ్చిన వరదలు కూడా క్లౌడ్ బరస్ట్ వల్లనే అంటూ ప్రచారం జరిగింది. ఉత్తరాఖండ్ వరదల టైంలోనూ ఈ పదం వరదల కంటే వేగంగా విస్తరించింది.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన ఆకస్మిక వానలు సైతం క్లౌడ్ బరస్ట్ వల్లే వచ్చాయంటూ స్వయంగా సీఎం కేసీఆర్ అన్నారు. ఇంతకీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి. ? ఆకస్మిక వరదలను సృష్టించడం సాధ్యమా. గోదావరి ఉగ్రరూపం వెనుక విదేశీ కుట్ర జరిగిందా?

కుంభవృష్టి వానలు వింతేమి కాదు.. వరదలు ముంచెత్తడం కొత్తేమి కాదు. కానీ ఈ మధ్య మేఘం గర్జించగానే ఎక్కడో కుట్ర జరుగుతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఆకస్మిక వానలు రాగానే.. అనుమానాలు పుట్టుకువస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలను ఆకస్మిక వానలు, వరదలు ముంచెత్తాయి. దీంతో ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్ జరిగిందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ వల్లే వరదలు సంభవించాయని అన్నారు. ఇక్కడ విదేశీ కుట్ర జరిగినట్లు అనుమానంగా ఉందంటూ ప్రకటించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఇప్పుడు మళ్లీ క్లౌడ్ బరస్ట్ చర్చనీయాంశంగా మారింది. మేఘాల విస్పోటనం మానవుడి వల్ల సాధ్యమా.. కృత్రిమ వర్షాన్ని కురుపించడం కుదురుతుందా ఇలా ఎన్నో ప్రశ్నలు మానవ మెదళ్లను తొలిచేస్తున్నాయి.

గత వారంలో అమరనాథ్ యాత్రలో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 16 మంది యాత్రికులు గల్లంతయ్యారు. సడన్‌గా వానలు, వరదలు రావడంతో వాతావరణశాఖ అధికారులు కూడా అవాక్కయ్యారు. అమర్‌నాథ్‌లో ఖచ్చితంగా క్లౌడ్‌బరస్ట్ జరిగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపారు.

గతంలో లడాఖ్ లోని లేహ్‌ ప్రాంతంలోనూ ఆకస్మిక వరదలు వచ్చాయి. అప్పుడు కూడా క్లౌడ్ బరస్ట్ జరిగిందనే వార్తలు వచ్చాయి. 2013లో ఉత్తరాఖండ్‌లోనూ ఇలానే ఆకస్మిక వరదలు వచ్చాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్ర అని డౌట్ రేజ్ చేయడంతో దేశమంతా ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ పైనే చర్చజరుగుతోంది.

క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాల విస్ఫోటనం. ఒక చిన్న ప్రదేశంలో ఒక గంటలో 10సెంటిమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ సార్లు మేఘాల విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంటుంది. అయితే 10 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే క్లౌడ్ బరస్ట్ అయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా రుతుపవనాలు దక్షిణ ప్రాంతంలోని అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. అటు పశ్చిమ మధ్యధరా తీరం నుంచి వీచే గాలులు తేమను తీసుకుని వస్తాయి. ఈ రెండూ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవే క్లౌడ్ బరస్ట్ కు కారణమవుతాయి. పర్వతాలపై ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి.

ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో తేమతో కూడిన భారీ మేఘాలు ఢీకొనడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందుకే వీటిని అంచనా వేయడం చాలా కష్టం. రాడార్ సహాయంతో ఎక్కడెక్కక భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయగలుగుతుంది. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చన్నది మాత్రం చెప్పలేకపోతుంది.

క్లౌడ్ బరస్ట్ సహజసిద్ధంగా ఏర్పడే విపత్తు.. కానీ క్లౌడ్ బరస్ట్‌లు సహజ సిద్ధంగా జరుగుతున్నాయా.. కృత్రిమంగా సృష్టిస్తున్నారా అన్నఅనుమానాలు అల్పపీడనం కంటే అధికంగా బలపడుతున్నాయి. గతంలో కరువు సమయంలో మేఘాన్ని కరిగించేందుకు క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చారు. కొన్ని కరువు దేశాల్లో ఇది సక్సెస్ అయ్యింది. కాని కుంభవృష్టి వర్షాన్ని కృత్రిమంగా కురుపించడం సాధ్యం కాదని సైంటిస్టులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story