V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర వెనుక పాత్ర ఎవరిది? ఛేదించిన పోలీసులు..

V Srinivas Goud (tv5news.in)
V Srinivas Goud: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాఫిక్‌గా మారింది. కుట్రను ఛేదించినట్టు తెలిపిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సుపారీ గ్యాంగ్‌తో హత్యకు పక్కా ప్లాన్ వేశారని అందుకు ఆధారాలు లభించాయని సీపీ స్పష్టం చేశారు. సుపారీ గ్యాంగ్‌తో మహబూబ్‌నగర్ వాసులే హత్యకు కుట్ర పన్నినట్టు గుర్తించమన్న సీపీ.. హత్యచేస్తే ఏకంగా 15 కోట్లు సుపారీ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తేలిందన్నారు.
తొలుత ఫిబ్రవరి 23న ఫారూక్, హైదర్ హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద లాడ్జీలో దిగినట్లు సీపీ తెలిపారు. ఫిబ్రవరి 25న ఫరూక్, హైదర్‌పై ఓ ముఠా దాడి చేయగా.. దాడి నుంచి తప్పించుకుని పేట్ బషీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారని సీపీ వెల్లడించారు. కేసు నమోదు అనంతరం విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరిపై దాడికి యత్నించింది యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ అని తేలినట్లు చెప్పారు.
ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మరికొందరి పేర్లు బయటకు వచ్చినట్లు సీపీ పేర్కొన్నారు. దాడిలో మరో నలుగురి ప్రమేయం ఉన్నట్లు నిందితులు బయటపెట్టారన్నారు. మంత్రి హత్యకు ఫారూక్‌తో రాఘవేంద్రరావు డీల్ కుదుర్చుకున్నట్లు సీపీ వెల్లడించారు. రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు. ఫరూక్‌ను మధుసూదన్, అమరేందర్ సంప్రదించగా డబ్బులిస్తామని ఒప్పుకున్నట్లు వెల్లడించారు.
ఈ హత్య కుట్ర గురించి ఫారూక్ మిత్రుడు హైదర్‌కు తెలుపగా.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. అది కాస్తా కుట్ర కోణం బయటపడేలా చేసిందన్నారు. హత్య కుట్ర ఫారూక్.. హైదర్‌కు చెప్పాడన్న కోపంతో.. వాళ్లిద్దరిని చంపాలని మిగతా వాళ్లు ప్లాన్ చేశారని సీపీ పేర్కొన్నారు. ఈ కుట్ర కోణం ఛేదించటంతో దొరికిపోతామన్న భయంతో రాఘవేందర్‌రాజు, అమరేందర్, రవి, మధుసూదన్.. విశాఖ మీదుగా ఢిల్లీ వెళ్లారని సీపీ వెల్లడించారు.
వీళ్లంతా ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్నారు. నిందితులకు జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ ఆశ్రయం ఇచ్చారని సీపీ తెలిపారు. ఇటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసినవారిని అదుపులోకి తీసుకుని లోతుగా ప్రశ్నించినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మంత్రిని హత్య చేయించాలని రాఘవేంద్రరాజు కుట్ర పన్నారన్నారు.
కుట్రలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. డీకే అరుణ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు. నిందితుల నుంచి రివాల్వర్, బులెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఇటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారంపై బీజేపీ నేతలు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు.
ఆర్టీఐ ద్వారా మంత్రి తప్పుల్ని వెలుగులోకి తెచ్చిన యువకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారన్న జితేందర్‌రెడ్డి.. పోలీసులు చట్టాన్ని కాపాడుతారా? లేక టిఆర్ఎస్ అరాచకాలకు వంత పాడుతారా అని ప్రశ్నించారు. అరాచకాలు చేస్తూ సానుభూతి కోసమే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డ్రామాకు తెరలేపారని డీకే అరుణ మండిపడ్డారు. కబ్జాలపై సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నందునే.. కక్ష గట్టారన్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com