GHMC కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఉత్కంఠ బరితంగా సాగిన గ్రేటర్ మేయర్ ఎన్నికల్లో చివరికి కారు పార్టీనే పైచేయి సాధించింది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది. ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీ విధేయులకే వరించింది. టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా సభ్యులు ఎన్నుకున్నారు.
అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు. విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. ఆమె మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేశారు.
మేయర్ పీఠం కోసం తొలినుంచి అధికార టీఆర్‌ఎస్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. సింధు ఆదర్శ్‌రెడ్డి తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేర్లు సైతం ప్రముఖంగా వినిపించాయి. అయితే రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్ చివరి నిమిషంలో కేకే కుమార్తెను ఖరారు చేశారు. అయితే విజయారెడ్డి సైతం మేయర్ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ అనూహ్యంగా విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. సభ్యులు చేతులెత్తి మేయర్‌ను ఎన్నుకున్నారు. సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జైశ్రీరాం అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు.
రాజ్యసభసభ్యులు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు కుమార్తైన గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి రెండోసారి టీఆర్‌ఎస్ కార్పోరేటర్‌గా గెలిచారు. రెడ్డి మహిళ కాలేజీలో బీఏ పూర్తి చేసిన గద్వాల విజయలక్ష్మి భారతీయ విద్యా భవన్‌లో జర్నలిజం పూర్తి చేశారు. ఆ తర్వాత సుల్తాన్ ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. బాబిరెడ్డితో వివాహం అనంతరం.. ఆమె 18 ఏళ్లు అమెరికాలో ఉన్నారు.
నార్త్ కరాలోనాలోని డ్యూక్ యూనివర్సిటిలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని తండ్రి కేకే వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2016లో మొదటిసారిగా బంజారాహిల్స్ కార్పోరేటర్‌గా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ప్రజాసమస్యలపై దూకుడుగా వ్యవహరించే నేతగా విజయలక్ష్మి గుర్తింపు పొందారు. ఇప్పుడు మేయర్ గా ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com