Telangana BJP : అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను లీడ్ చేసేది ఎవరు?

Telangana BJP : హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయంతో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. ఈటెల గెలుపుతో బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఊపు వచ్చింది. దీంతో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు చెప్పుచుకుంటున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో పార్టీ పుంజుకుటుందని నేతలు, పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఇక రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ... ఇప్పుడు ఆ సంఖ్యను మూడుకు పెంచుకుంది. ఇందులో రెండు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల నుంచి గెలుపొందినవే. దీంతో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలు ఇచ్చినట్లయిందని కాషాయ పెద్దలు భావిస్తున్నారు.
హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ అసెంబ్లీలో కేసీఆర్‌కు ట్రిపుల్ ఆర్ షో చూపిస్తా అంటూ ప్రచారం చేసి ప్రజలను ఉత్సాహ పరిచారు. ఈటెల రాజేందర్ విజయం సాధించడంతో పార్టీలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను లీడ్ చేసేది ఎవరు అనే ప్రశ్న తలెత్తోంది. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడమేగాక ముందు నుంచి బీజేపీలో ఉన్నా రాజాసింగా? దుబ్బాక ఉప ఎన్నికలో మొదటిసారి గెలిచిన రఘునందన్ రావా? ఎమ్మెల్యేగా 7వ సారి ప్రమాణ స్వీకారం చేసిన ఈటెల రాజేందరా? ఇప్పటిదాకా రాజాసింగ్‌నే ఎల్పీ నేతగా కొనసాగించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. తాజాగా ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీ తరఫున హుజూరాబాద్ నుంచి గెలుపొందడంతో ఆయననే ఎల్పీ నేతగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ ఎల్పీ నేత పేరుపై మరోసారి చర్చ మొదలైంది. పార్టీ సీనియర్ నేతగా ఉన్నా రాజాసింగ్‌నే ఇప్పుడు కూడా ఎల్పీ లీడర్‌గా కొనసాగిస్తారా లేక తాజాగా పార్టీ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. అధికార టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ ఎత్తులను సైతం ఢీకొట్టి విజయం సాధించారు ఈటెల రాజేందర్. ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు ఉంది.
ఇప్పుడు ఏడోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో అసెంబ్లీలో సీనియర్ మెంబర్‌గా, టీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కునే సత్తా నేతగా ఈటలకు పేరుంది. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలంటే ఈటలను ఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మంత్రిగా పనిచేసిన ఈటల... పార్టీ నిర్ణయానికి గౌరవం ఇస్తూ రాజీనామా చేశారు. బీజేపీలో చేరి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆయనకు ఎల్పీ నేతగా అవకాశం ఇచ్చి గౌరవించడమే సరైన నిర్ణయం అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
మరి రాష్ట్ర నాయకత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? దీనికి మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనేది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com