TG: కొత్త సీఎస్ ఎవరో..?

తెలంగాణ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరనేదానిపై ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతి కుమారి ఏప్రిల్ 7న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో ఎవరు వస్తారన్నది ఆసక్తి రేపుతోంది. స్పెషల్ సీఎస్‌లుగా ఉన్న కొందరు ఐఏఎస్‌లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీనియర్ ఐఏఎస్‌లతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీఎస్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా.. శాంతి కుమారినే చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూ వస్తోంది.1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు ఈ ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్‌గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండగా, ప్రభుత్వానికి అవసరమైన నిధులను సమకూర్చడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు పేరుంది. ఈయన వైపే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ప్రస్తుతం ఐటీ, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈయనపేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com