Ys Sharmila New Party : తెలంగాణలో షర్మిల సొంత పార్టీ దేనికోసం?

Ys Sharmila New Party : తెలంగాణలో షర్మిల సొంత పార్టీ దేనికోసం? అన్నపై కోపంతో రంగంలోకి దిగారా? అందుకే ఫ్లెక్సీలపై జగన్ ఫోటో లేదా? పైగా ఒక్క రాజ్యసభ సీటు కోసం ఏకంగా పార్టీనే పెట్టాలనుకుంటున్నారా? షర్మిల సొంత పార్టీపై ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాని, షర్మిల కొత్త పార్టీ వెనక తెలియని రహస్యం దాగుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇదంతా బ్రదర్ అనిల్ కుమార్ యాక్షన్ ప్లాన్ అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్‌తో విభేదాల కారణంగానే బ్రదర్ అనిల్ ప్రోద్బలంతో షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని ఊహాగానాలు వినబడుతున్నాయి.
జగన్ జైలుకి వెళ్లినప్పుడు.. పాదయాత్ర చేపట్టి కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు షర్మిల. జగనన్న చెల్లెల్ని అంటూ పార్టీ నేతలను, కార్యకర్తలను కలుపుకున్న తీరుని వైసీపీ లీడర్లు అంత ఈజీగా మరిచిపోరు. మొన్నటికి మొన్న జగన్ తరపున ప్రచారం కూడా చేశారు. ఇంత చేసిన షర్మిలకు అన్నయ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్న అసంతృప్తి కొందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా బ్రదర్ అనిల్.. జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నది టాక్. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తారని ఆశించారు, ఏడాదిన్నర పాటు వేచి చూశారు. కాని, ఉలుకూపలుకూ లేదు.
దీంతో బ్రదర్ అనిల్.. షర్మిలను ముందు పెట్టి పావులు కదుపుతున్నారని మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటుతో జగన్‌కు జలక్ ఇచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు కనిపిస్తోంది. మరో 30 రోజుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టి.. ఆ తరువాతే పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. YSR, తెలంగాణ పేర్లు వచ్చే విధంగా పార్టీకి నామకరణం చేస్తారని టాక్. అంతేకాదు, పార్టీ ప్రకటన తరువాత ఏకంగా 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేయాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com