ప్రాణం పోయినా న్యాయం జరగాల్సిందే!

చాలా ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఓ అమ్మాయికి ఆదిలోనే ఆశలు ఆవిరైపోయాయి. కట్టుకున్న భర్త ప్రేమగా చూసుకుంటాడని ఎన్నో కలలుకంటే.. అతగాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. పోనీ అత్తామామలు అయినా తనకి అండగా ఉంటారా అనుకుంటే.. ఆమెను వదిలించుకునేందుకే మొగ్గు చూపారు. దీనితో ఏం చేయాలనీ పరిస్థితిలో భర్త ఇంటిముందు న్యాయం కోసం దిగింది ఓ ఇల్లాలు!
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లాకి చెందిన పైడి నవీన్ కుమార్ కు వేములవాడకు చెందిన అరుణతో 2017 అక్టోబర్ 6న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అరుణ తల్లిదండ్రులు పెళ్లికొడుకు నవీన్ కి రూ.14 లక్షల నగదు, 23 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. దీనికి తోడు ఆడపడుచు కట్నం కింద మరో రూ. 50 వేలు కూడా ఇచ్చారు. అయితే పెళ్ళైన పదిరోజుల నుంచే అరుణ పట్ల ఆమె మామ సురేందర్ కొంచం వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
ఎలాగోలా ఆరు నెలలు నెట్టుకొచ్చిన అరుణ ఆరోగ్యం బాగోలేక పుట్టింటికి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి భర్త మరో అమ్మాయితో పెళ్ళికి రెడీ అయిపోతుండడంతో షాక్ అయింది. దీనితో గతేడాది భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. అయినప్పటికీ న్యాయం జరగకపోవడంతో మరోసారి భర్త ఇంటిముందు న్యాయం కావాలని కూర్చోంది. ప్రాణం పోయినా సరే.. న్యాయం కావాలని అంటుంది అరుణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com