REVANTH: బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తారా? గద్దె దించమంటారా?

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. “బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లుపై చర్చ జరగాలని కోరుతూ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలని రేవంత్ డిమాండ్ చేశారు. “బీసీ కోటా బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలలుగా రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అపాయింట్మెంట్ ఇవ్వమని కోరినా, రాష్ట్రపతి ఇప్పటివరకు సమయం కేటాయించలేదు,” అని ఆయన విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు, పార్టీలోని బీసీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో కులగణన చేపట్టడం రాహుల్ గాంధీ సూచన మేరకే జరిగిందని రేవంత్ తెలిపారు. “రాహుల్ గాంధీ ఆశయం ప్రకారం 42 శాతం బీసీ కోటా బిల్లు తెచ్చాం. ఈ కోటా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం,” అని స్పష్టం చేశారు.
మోదీ మోచేతి నీళ్లు తాగే వాళ్లు...
‘‘బీసీ రిజర్వేషన్ల కోసం 4 కోట్ల మంది ముక్త కంఠంతో విజ్ఞప్తి చేశారు. జంతర్ మంతర్ వేదికగా మోదీ, ఎన్డీయేకు సవాల్ విసురుతున్నా. మా డిమాండ్‌ను ఆమోదిస్తారా?మిమ్మల్ని గద్దె దించాలా? మా ఆలోచనలు, బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు? మోదీ మన బద్ధశత్రువు.. బలహీనవర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు ఏమైంది?తెలంగాణలో మీరు బలహీనవర్గాలను ఓట్లు అడగలేదా?ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా?పేరు బంధం తెగిన తెరాస (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి).. పేగు బంధం కూడా తెలంగాణతో తెగిందా?’’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి ముర్మును కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అపాయింట్మెంట్ కోరామని, అయితే అపాయింట్మెంట్ లభించలేదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి కార్యాలయంపై ఒత్తిడి తెస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లులకు మద్దతు ఇచ్చినప్పటికీ, కేంద్రంలో వాటిని అడ్డుకుంటోందని ఆరోపించారు.రాష్ట్రపతి ఆమోదం లభించే వరకు బీసీ రిజర్వేషన్లు అమలు కావని, అందుకే తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని రేవంత్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com