పచ్చి బాలింత.. కార్డియాక్ అరెస్ట్ తో మృత్యుఒడిలోకి

పురిటి బిడ్డని తనివి తీరా చూసుకోనేలేదు.. అమ్మతనాన్ని ఆస్వాదించనేలేదు.. అప్పుడే ఆ తల్లి గుండె ఆగిపోయింది. చిన్నారి బాలుడు ఒంటరి వాడయ్యాడు.. అమ్మలేని వాడయ్యాడు.. ఈ దురదృష్టకర సంఘటన వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వర్ధన్న పేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత ప్రసవం కోసం ఈ నెల 13న సీకేఎం ఆస్పత్రిలో చేరింది, 16న మగబిడ్డను ప్రసవించింది.
పుట్టిన బిడ్డకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆస్పత్రిలో ఉన్న నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో చేర్చారు. చికిత్స పొందుతున్న బిడ్డకు పాలుపడుతూ ఆస్పత్రిలోని సీమాంక్ వార్డులో ఉన్న సుస్మిత శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో బిడ్డకు పాలు పట్టింది. అనంతరం పక్కవార్డులో పడుకున్న ఆమెను ఉదయం 6 గంటలకు కుటుంబసభ్యులు వచ్చి లేపగా ఆమెలో కదలికలు లేవు.. దాంతో వారు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు.
స్పందించిన వైద్యాధికారులు వచ్చి సుస్మితను పరిశీలించారు. కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించారు. వెంటనే సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో సుస్మిత మృతి చెందినట్లు నిర్ధారించారు. మూడు రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చి అప్పుడే మృత్యుఒడిన సుస్మితను చూసి కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com