TG: తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్‌లు

TG: తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్‌లు
రెండేళ్లలో 150 మహిళ శక్తి క్యాంటీన్ల ఏర్పాటే లక్ష్యమన్న సీఎస్ శాంతికుమారి.. క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్ లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. మహిళ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మహిళాశక్తి క్యాంటీన్ సర్వీసులపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లు, బస్టాండ్ లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న CS క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. బెంగాల్ లో దీదీ కా రసోయ్, కేరళలో అన్న క్యాంటీన్లపై అధ్యయనం చేశామని తెలిపారు. క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, అవసరమైన స్థలం వంటి అంశాలతో రోడ్ మ్యాప్ తయారు చేయాలని అధికారులను CS ఆదేశించారు.


మరోవైపు... తెలంగాణ ప్రభుత్వం వర్షాకాల శాసనసభ సమావేశాలకు సిద్దమవుతోంది. వివిధ శాఖలతో వరుస సమీక్షల నిర్వహణకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు సమాయత్తమవుతున్నారు. అందుకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్య, వ్యవసాయ కమిషన్‌లతోపాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ROR చట్టాలు తదితర అంశాలు.. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమావేశమైన శాసనసభ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక ఏడాది మొదటి నాలుగు నెలలకు సంబంధించి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ జూలై వరకు అమలులో ఉంటుంది. ఆగస్టు నుంచి తదుపరి మార్చి వరకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం పూర్తిస్థాయి బడ్జెట్‌కు రూపకల్పన చేయాల్సి ఉంది. ఈ నెలలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించి NDA సర్కార్‌.. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర పద్దులో రాష్ట్రానికి కేటాయింపులు ఏ మేరకు ఉంటాయో చూసుకుని.. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, రానున్న రోజుల్లో.. అమలు చేయనున్న కార్యక్రమాల అమలకు నిధులు కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరగనుంది.

Tags

Next Story