Women’s Reservation Bill: మహిళా బిల్లుపై హర్షాతిరేకాలు

Women’s Reservation Bill: మహిళా బిల్లుపై హర్షాతిరేకాలు
తెలంగాణలో సంబరాలు చేసుకున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ... ఎన్నికల ఎత్తుగడన్న కాంగ్రెస్‌

మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని తెలంగాణలో రాజకీయ పార్టీలు స్వాగతించాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్‌ఎస్‌ పోరాటం ఫలించిందని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. సుదీర్ఘంకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుపై ఇప్పటికైనా ఓ ముందడుగు పడిందని హర్షం వ్యక్తంచేసిన ఎంపీ కె.కేశవరావు, MLC కవిత O.B.C రిజర్వేషన్లను కూడా బిల్లులో చేర్చాలని డిమాండ్‌ చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లును జాప్యం చేయకుండా ఆమోదించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది.


నిజామాబాద్‌లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కవిత చిత్రపటానికి విద్యార్థినులు, మహిళా నేతలు, జాగృతి నాయకులు పాలాభిషేకం చేశారు. మొదట నగరంలోని కేసీఆర్ కమాన్ నుంచి ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఆనంతరం ఎమ్మెల్సీ కవిత చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ కవిత పోరాటం ఫలితంగానే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడం లో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందు ఉంటారన్నారు.


నూతన పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లతో కేంద్రప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్న బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు మాని ముందు తెలంగాణలో మహిళా కోటా అమలు చేసి చూపించాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు నూతన పార్లమెంటు భవనంలో.. కీలక ముందడుగుగా అభివర్ణించిన బీజేపీ అన్ని పార్టీలు ఇందుకు మద్దతు పలకాలని కోరింది. మహిళలకు బీజేపీ పెద్దపీట వేస్తోందని ఎంపీ లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత రిజర్వేషన్ల బిల్లును తమ ఘనతగా చెప్పుపోవడం విడ్డూరమని విమర్శించారు

రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ ఎన్నికల ముంగిట.. మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందని తెలంగాణ కాంగ్రెస్‌ విమర్శించింది. వెంటనే రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసీ కూడా వీటిని తెరపైకి తెచ్చారని విమర్శించారు..

మహిళా బిల్లుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలపడం శుభపరిణామని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎన్నికల సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నిల్లో లబ్ధిపొందేందుకు బిల్లు తెచ్చారని B.S.P రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.. మహిళా రిజర్వేషన్లు బిల్లు పార్లమెంటుకు రావడంపై రాష్ట్రంలోని పలుచోట్ల బీఆర్‌ఎస్‌. బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.

Tags

Next Story