తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఆహ్వానం పంపింది. ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సుకు హాజరు కావాలని లేఖ రాసింది. కరోనా అనంతరం దేశాల రికవరీ, నూతన టెక్నాలజీ వినియోగంపై ఈ ఏడాది ఏప్రిల్ 5-7 తేదీల మధ్య జపాన్ రాజధాని టోక్యో నగరంలో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరుగనున్నది. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు భాగస్వాములు కానున్నారు.
కొవిడ్ నేపథ్యంలో దేశాలు తిరిగి వృద్ధి బాట పట్టడంలో.. టెక్నాలజీ వినియోగంపై చర్చించనున్నారు. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో నూతన టెక్నాలజీల వినియోగం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలను మరింతగా ముందుకు తీసుకెళ్లే అంశంతో పాటు ఆయా టెక్నాలజీల పరిమితులను అధిగమిస్తూ వృద్ధిని వేగవంతం చేయడం.. ఈ రంగాల్లో ఏ విధంగా ఇన్నోవేషన్‌ను ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
టెక్నాలజీని సమాజ హితం కోసం వాడటం పట్ల మంత్రి కేటీఆర్‌పై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రశంసలు తెలిపింది. తెలంగాణలో ఐటీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నూతన టెక్నాలజీ వినియోగం పట్ల అభినందించింది. ఏఐ4ఏఐ, జీ-20 స్మార్ట్ సిటీస్‌కు మద్దతు తెలపడంపై ధన్యవాదాలు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com