టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు..!

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని, టీఆర్‌ఎస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీనే అంటూ మాట్లాడారు. తెలంగాణ వివక్షకు గురైందని గ్రహించి స్వరాష్ట్రాన్ని ఇచ్చారని టీఆర్‌ఎస్ కార్యకర్తల ముందు పొగిడారు. మావోయిస్టులు సైతం దేశ భక్తులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడనే కాదు.. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ టీఆర్‌ఎస్ పార్టీకి తలనొప్పిగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు.. డబ్బులు పంచండి, ఓటర్లను కొనండి అంటూ స్వయంగా తన అనుచరులకు చెప్పారు.
స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ.. ఇప్పటికీ కాంగ్రెస్ వాసనలు పోలేదు. పదే పదే కాంగ్రెస్ ఊసు ఎత్తకుండా ఉండలేరు. టీఆర్‌ఎస్ మీటింగులో సైతం కాంగ్రెస్ కార్యకర్తలనే తలచుకుంటుంటారు. ఈ వ్యవహారంతో టీఆర్ఎస్ శ్రేణులు ఒకింత ఇబ్బందికర పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ దయా దాక్షిణ్యాలతో రాలేదని ఓవైపు టీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటుంటే.. రాములు నాయక్ మాత్రం తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కాంగ్రెస్‌నే పొగుడుతున్నారు. రాములు నాయక్ వ్యవహారంపై టీఆర్‌ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com