Yadadri : పర్వతగిరి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు

నాటి కాకతీయుల కాలంలో వందలాది శైవక్షేత్రాలు వెలిశాయి. వాటిలో కొన్ని అరుదైన శైవక్షేత్రాలు మనకు కనిపిస్తుంటాయి. అయితే కాలక్రమేణా నిజాం పాలనలో పేరొందిన శైవక్షేత్రాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. అలాంటిదే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ హైవే పక్కన ఉన్న పర్వతగిరి'ముక్కంటి శివలింగేశ్వరస్వామి-శివ రేణుక ఎల్లమ్మ తల్లి' దేవాలయం. దశాబ్దాల పాలకుల పాలనలో ఈ చారిత్రాత్మకమైన శివాలయం పూజలు, పునస్కారాలకు దూరంగా ఉంది.
దాదాపు 400 సంవత్సరాల క్రితమే పర్వతగిరి శివాలయంలో పూజలు జరిగేవని చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివలింగం ప్రత్యేకత బాణం ఆకారంలో ఉంటుందని.. అరుణాచల విగ్రహాన్ని తలపిస్తుందని పూజారులు చెబుతున్నారు. గతంలో సంస్థాన్ నారాయణపూరానికి చెందిన కొందరు రాజులు.. మహాశివరాత్రి సహా కార్తీక మాసం లాంటి పర్వదినాల్లో పర్వతగిరి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారని.. అనంతరం నిజాం నవాబులు ఇలాంటి శైవక్షేత్రాలు ధ్వంసం చేశారని పురాణాలు చెబుతున్నాయి.
రెండేళ్లకిందట పర్వతగిరి కొండను బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు సందర్శించడం జరిగిందన్నారు పూజారి. అప్పుడు కొండ విశిష్టిత బయటపడిందన్నారు. కొండపైన ఉన్న శివలింగాన్ని గమనించిన నాయకులు.. శివలింగాన్ని ప్రతిష్టించి, మూడేళ్లుగా పూజలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. పర్వతగిరి శివాలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి బాధ్యత తీసుకున్నారు. త్వరలోనే హంపీ పీఠాధిపతి సలహాలు, సూచనలతో శివాలయాన్ని పున:ప్రతిష్టిస్తానని చెప్పారు. గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ద్వారా నిధులను ఖర్చుచేసి పునర్ వైభవం తీసుకొస్తానని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com