KHAMMAM: యాసిడ్ పోసి చంపేస్తానంటూ యువకుడి హల్‌చల్

ఖమ్మంలో ఓ యువకుడు హల్‌చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రేమించిన యువతిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే...యాసిడ్ పోసి చంపేస్తానంటూ ఆ యువకుడు హల్ చల్ చేశాడు. ఆ యువకుడి ఉన్మాద చేష్టలకు భయపడిపోయిన బాలిక.. ఆమె తల్లి ఇంటికి గేటుకు తాళం వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. వీఎం బంజరకు చెందిన బొర్రా సాయిమహేందర్ జులాయిగా తిరుగుతున్నాడు. పదోతరగతి వరకు చదివిన సాయి మహేందర్... ఆ తర్వాత చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఓ బాలికను ప్రేమించాలంటూ లేకుంటే చంపేస్తానంటూ కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు.
కళాశాలకు వెళ్లిన బాలిక
ఇంటర్ చదువుతున్న బాలిక...ప్రత్యేక తరగతుల కోసం కళాశాలకు వెళ్లింది. అక్కడికి మద్యం తాగి వెళ్లిన సాయిమహేందర్...ఆ బాలిక బయటకు రావాలంటూ కత్తితో హడావుడి చేశాడు. బయటకు రాకుంటే చంపేస్తానంటూ ఉన్మాదిగా ప్రవర్తించాడు. కత్తితో తన చేతులనే కోసుకుంటూ పిచ్చిగా ప్రవర్తించాడు. బయపడిపోయిన బాలిక ఎలాగోలా ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం తల్లికి చెప్పి బోరున విలపించింది. మళ్లీ ఆ ఉన్మాది ఇంటికి వస్తాడేమోనని భయపడిపోయిన తల్లీ,కుమార్తె ఇంటి గేటుకు తాళం వేసుకుని లోపలే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. కొద్దిసేపటకి అక్కడికి చేరుకున్న సాయిమహేందర్...ఈసారి యాసిడ్ సీసా, కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయికి వేరే పెళ్లి చేస్తే యాసిడ్ పోసి చంపుతానంటూ బెదిరించాడు. కాసేపటికి సృహతప్పి బాలిక ఇంటి ముందే పడిపోయాడు. సాయి మహేందర్‌తో ప్రాణహాని ఉందని బాధితురాలి తల్లి V.M బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com