Thalapathy Vijay: విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు వెనుక అసలు నిజమిదే..

Thalapathy Vijay (tv5news.in)
Thalapathy Vijay: సినిమా హీరోలు, హీరోయిన్లు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బతికేస్తారు అనుకోవడం పూర్తిగా నిజం కాదు. ఫ్యాన్ వార్స్ లాంటి వల్ల అభిమానులే కాదు.. హీరోలు కూడా నష్టపోతారు. వారిపై ఎంతమంది నెగిటివ్ అభిప్రాయాన్ని పెంచుకుంటున్నారో చెప్పలేం. వారిపై వచ్చే ట్రోలింగ్స్ ఏ పరిణామానికి దారితీస్తాయో ఊహించలేం. తాజాగా అలాగే తమిళ హీరో విజయ్ ఇంట్లో దుండగులు బాంబు పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది.
తాజాగా చెన్నై నగర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్‌లో హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఒక అపరిచిత వ్యక్తి చెప్పాడు. దీంతో కంగారుపడిన పోలీసులు హుటాహుటిన అర్థరాత్రి నీలాంగరైలోని విజయ్ ఇంటికి చేరుకున్నారు. వారితో పాటు బాంబు స్క్వాడ్ కూడా వెళ్లారు. అంగుళం వదలకుండా ఇళ్లంతా సోదా చేశారు.
విజయ్ ఇంట్లో బాంబు ఆనవాళ్లు ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ ఫోన్ ఎవరు చేశారో దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి చెందిన భువనేశ్వర్ అనే మనస్థిమితంలేని యువకుడు ఈ పని చేసినట్లు వెల్లడైంది. గతంలో కూడా ఆ యువకుడు ఇలా పలుమార్లు చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త విన్న ప్రజలు గతంలో కూడా విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడాన్ని గుర్తుచేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com