తారకరత్నకు సినీ, రాజకీయ నేతల నివాళులు

తారకరత్నకు సినీ, రాజకీయ నేతల నివాళులు

నటుడు తారకరత్నకు సినీ, రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని తారకరత్న నివాసం మోకిలకు ప్రముఖులు ఒకొక్కరుగా చేరుకుంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు.

రేపు ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్ధివదేహం తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం రేపు ఫిల్మ్ ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయం ఉంచనున్నారు. రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్ర 4గంటల వరకు తారకరత్న పార్ధివదేహం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక సాయంత్రం ఫిల్మ్ నగర్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజుల పాటు చికిత్స పొందిన నందమూరి తారకరత్న నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. విదేశీ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆయన్ను బతికించుకునేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించిన ఫలించలేదు. 23 రోజులపాటు తారకరత్న మృత్యువుతో పోరాడి కన్ను మూశారు.

గత నెల 27న ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. యాత్రలో కొద్ది దూరం నడిచిన తర్వాత ఆకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే అక్కడ ఉన్న యువగళం సిబ్బంది..కార్యకర్తలు కుప్పంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. తర్వాత చిత్తూరు పీఈఎస్‌ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. వైద్యులు, కుటుంబసభ్యుల సూచనతో బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందించారు. 23రోజులపాటు ఆయనకు అత్యాధునిక వైద్యం అందించి బతికించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

తారకరత్న ఎన్టీఆర్‌ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడు. 1983 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జన్మించారు. అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే హీరోగా తారకరత్న తెరంగేట్రం చేశారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే నటనపై ఉన్న ఆసక్తితో.. 2002లో విడుదలైన ఒకటో నెంబర్‌ కుర్రాడుతో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా విజయం సాధించడంతో తారకరత్నకు వరుస అవకాశాలు వరించాయి. హీరోగానే కాకుండా విలన్‌, సహాయ నటుడిగానూ నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి, నందీశ్వరుడు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అమరావతి చిత్రానికి గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు. ఇటీవల 9 అవర్స్‌ వెబ్‌ సిరీస్‌లో ఆయన నటించి.. ప్రేక్షకుల్ని అలరించారు. ఇక, రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండే తారక రత్న తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. గతంలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story