Jagapathi Babu Birth Day Special : జగపతి బాబుని అలా చూసి ఆశ్చర్యపోయిన టాలీవుడ్

జగపతి బాబు.. ఈ పేరు వినగానే ఆయన చేసిన ఎన్నో పాత్రలు కళ్లముందు కదలాడతాయి. అసలు నటుడిగానే పనికిరాడన్న కమెంట్స్ ను దాటి.. బెస్ట్ యాక్టర్ గా ఏకంగా ఏడు నంది అవార్డులు అందుకుని విమర్శకుల నోళ్లుమూయించాడు. శోభన్ బాబు తర్వాత మహిళాభిమానులను ఆ స్థాయిలో సంపాదించుకున్న జగపతి బాబు రియల్ లైఫ్ లోనూ మ్యాన్లీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోన్న జగపతిబాబు బర్త్ డే ఇవాళ (ఫిబ్రవరి 12).
అండదండలు ఎన్ని ఉన్నా అదృష్టం కూడా అవసరమైన పరిశ్రమ ఇది. అది వరించే సరికి, కాస్త టైమ్ పట్టింది కానీ, జగన్నాటకం, పెద్దరికం సినిమాలతో జగపతిబాబుకు పెద్ద బ్రేక్ వచ్చింది. పెద్దరికంతో యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ రెండు సినిమాల తర్వాత జగపతిబాబుకు ఇక తిరుగు లేకుండా పోయింది.
గాయం తర్వాత రాఘవేంద్రరావు దృష్టిలో పడ్డాడు. గాయంకు పూర్తిగా అపోజిట్ క్యారెక్టర్ లో అల్లరి ప్రేమికుడులో ప్లే బాయ్ గా చూపించాడు రాఘవేంద్రరావు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లున్నారు. ఆడియో సూపర్ హిట్ అయింది కానీ సినిమా ఆ స్థాయి హిట్ కాదు. తర్వాత చేసిన జైలర్ గారి అబ్బాయి యావరేజ్ అనిపించుకున్నా.. ఆశించిన విజయాన్నైతే ఇవ్వలేదు.
1994.. జగపతిబాబు చాలా యేళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడింది. అప్పటి వరకూ క్లాస్, మాస్ డైరెక్టర్స్ చేతిలో పడ్డా రాని ఇమేజ్ ఎస్వీ కృష్ణారెడ్డి ఇచ్చాడు. శుభలగ్నంలో భార్య పెట్టే ఇబ్బందులను తట్టుకుని, చివరకు డబ్బు కోసం తనను అమ్మినా ఆమె పై ఉండే ప్రేమతో నిశ్శబ్ధంగా ఉండే సగటు మనిషిగా జగపతిబాబు నటనకు లేడీస్ అంతా ఫిదా అయిపోయారు. శోభన్ బాబు తర్వాత అలాంటి హీరో మళ్లీ దొరికాడని ఎంటైర్ ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.
అంతఃపురం తర్వాత సముద్రం, మనోహరం వరకూ మళ్లీ అతనికి మంచి సినిమాలు పడలేదు. నటన పరంగానూ గొప్పగా అనిపించిన సబ్జెక్టులు రాలేదు. అయితే మనోహరంలో అతని నటనకు ప్రశంసలతో పాటు అవార్డులూ వచ్చాయి. మంచి కథ పడితే ఆ కథలో తనను తాను నిరూపించుకునేందుకు జగపతి ఎప్పుడూ వెనకాడలేదు.
హీరోగా చేసిన చోట విలన్ గా చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ వరుస ఫ్లాపులతో ఇమేజ్ మాగ్జిమం కోల్పోతున్న టైమ్ లో జగపతిబాబు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించినా.. బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ లో అతన్ని విలన్ గా చూసి తెలుగు పరిశ్రమ ఆశ్చర్యపోయింది. జగపతిబాబు జస్ట్ హీరో మాత్రమే కాదు.. ఏ పాత్రైనా చేయగల కెపాసిటీ ఉన్న సిసలైన నటుడు అని ఆడియన్స్ కూడా అనుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com