నేనేం దీనస్థితిలో లేను.. ఆ వార్తలు ఎంతగానో బాధించాయి : నారాయణమూర్తి

సోషల్ మీడియాలో తనపైన వస్తున్న వార్తల పైన సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు. ఆ వార్తలు తనని ఎంతగానో బాధించాయని అన్నారు. తాజాగా 'రైతన్న' కార్యక్రమంలో పాల్గొన్న గద్దర్.. ఆర్ నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ.. ''ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు'' అంటూ మాట్లాడారు.
అయితే ఆయన మాటలను సోషల్ మీడియా వక్రీకరించింది. ఆర్ నారాయణమూర్తి దీన స్థితిలో ఉన్నారని, కనీసం ఇల్లు రెంటు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపైన ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడంతో ఎంతోమంది తనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఫోన్‌లు చేయడంతో తనను మానసికంగా కుంగదీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తన దగ్గర డబ్బు ఉందని, తానూ ఆనందంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 'రైతన్న' సినిమాను ఎప్పుడు విడుదల చేద్దామా అనే ఆత్రుతతో ఉన్నానని, ఈ సమయంలలో తానూ దీనస్థితిలో ఉన్నానంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఎక్కడెక్కడి నుంచో అభిమానులు ఫోన్లు చేసి నామీద దయ చూపిస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. వాళ్ళ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మనశ్శాంతి కోసం పల్లెటూరులో ఉంటున్నట్టుగా నారాయణమూర్తి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com