'ఆర్‌ఎక్స్ 100' చూడొద్దన్నారు.. రాత్రికి రాత్రే స్టార్

ఆర్‌ఎక్స్ 100 చూడొద్దన్నారు.. రాత్రికి రాత్రే స్టార్
తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ కచ్చితంగా ఉంది.

నటీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయినా ఒక్కోసారి తగిన గుర్తింపు లభించదు.. కానీ వారిని వెతుక్కుంటూ వచ్చే ఒక్క సినిమా చాలు రాత్రికి రాత్రి స్టార్ అయిపోతారు.. ఆ సినిమా తెచ్చిన స్టార్‌డమ్ మరిన్ని అవకాశాలు వెల్లువెత్తుతుంటాయి. అలాంటి కోవకి చెందిన వారు పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 తో యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ బర్త్‌డే ఈ రోజు. పాయల్ గురించిన కొన్ని ఆసక్తికర విషయలు..

పంజాబీ కుటుంబంలో పుట్టిన పాయల్ అమ్మానాన్నా ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అమ్మకి యాంకరింగ్ అంటే ఇష్టం.. అందుకే చదువుకునే రోజుల్నించి కూతుర్ని యాంకరింగ్ చేయమంటూ ప్రోత్సహించేవారు ఆమె. బాలనటిగా బుల్లితెరమీద అడుగుపెట్టిన పాయల్ జర్నలిజంలో డిగ్రీ పూర్తయ్యాక మోడలింగ్ చేస్తూ యాంకర్‌గా కూడా రాణించింది. ఆ తర్వాత సినిమాల్లో నటించాలనే కోరికతో తను మోడల్‌గా, యాంకర్‌గా సంపాదించిన లక్ష రూపాయలతో ముంబై నగరంలో అడుగు పెట్టింది.

అవకాశాల కోసం ప్రయత్నించింది. తెలుగు, తమిళ చిత్రాలకు సంబంధించిన ఆడిషన్లకు హాజరైంది. ప్రతి చోటా సినిమాలకు పనికొచ్చే మొహం కాదు తిరస్కరణ ఎదురయ్యేది. 2010లో బుల్లితెర ధారవాహికల్లో నటించే అవకాశం వచ్చింది. ఎట్టకేలకు తన సినిమా ప్రయత్నం ఫలించి 2017లో 'చన్నా మేరేయా' అనే పంజాబీ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌పేర్ అవార్డ్ అందుకుంది. హిందీ సినిమా వీరే కీ వెడ్డింగ్ లోన చిన్న పాత్రలో కనిపించింది. ఆమె దశను మార్చిన చిత్రం రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తీసిన ఆర్ఎక్స 100.

రెగ్యులర్ సినిమాలు చూసేవారు ఆర్ఎక్స్ 100 చూడొద్దంటూ అజయ్ కామెంట్ ప్రేక్షకుల్ని సినిమా థియేటర్ వైపు నడిపించింది. ప్రియుడ్ని మోసగించిన ప్రియురాలిగా పాయల్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రాత్రికి రాత్రే ఆ సినిమాతో ఆమె స్టారైపోయారు. ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన వెంకిమామ, డిస్కోరాజా సినిమాల్లో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. ఇటీవల విడుదలైన అనగనగా ఓ అతిథి చిత్రంలో డీగ్లామర్ లుక్‌తో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మంచి నటిగా మరోసారి నిరూపించుకుంది. ఆమె నటించిన తమిళ చిత్రం ఏంజెల్ విడుదల కావల్సి ఉంది.

ఆర్ఎక్స్‌కి ముందు అభద్రతా భావం.. ఆ సినిమా సక్సెస్ తరువాత వచ్చిన ఆనందంతో పాటు తన జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. ఆ చిత్రంతో వచ్చిన డబ్బుతో ముంబయిలో ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఆ ఇంటిపైన ఆర్ఎక్స్ 100 కు గుర్తుగా ఓ బైక్ కూడా పెట్టుకుంది. టాలీవుడ్‌లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ కచ్చితంగా ఉంది. ఇది నన్ను బాగా నిరాశకు గురి చేసింది. హిట్ వచ్చిన తరువాత కూడా కాంప్రమైజ్ అవ్వమని అడుగుతున్నారు. ఆర్‌ఎక్స్‌లో నేను చేసిన బోల్డ్ పాత్ర వల్లే అలా అడుగుతున్నారనుకున్నా.. కానీ నాకు నాపై నమ్మకం ఉంది. నా ప్రతిభ నన్ను నిలబెడుతుంది అని అన్నారు.

Tags

Next Story