సీతారామయ్యగారి మనవరాల్లో ఎన్ని ట్విస్టులో.. అక్కినేని, మీనా పాత్రల కోసం మరొకరిని..

సీతారామయ్యగారు విగ్గులేకుండా నటించనన్నారు. దర్శకుడికేమో విగ్గు లేకుండా నటిస్తేనే పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని గట్టి నమ్మకం.. నాగేశ్వర్రావు మాత్రం ససేమిరా అన్నారు. నా గ్లామర్ నావిగ్గే.. బట్టతలతో నటించడమా బాబోయ్ నావల్ల కాదు అన్నారు. చేసేదేముంది అని ఆయన కోసం 4, 5 విగ్గులు తెప్పించింది చిత్ర యూనిట్.. ఒక్కటీ సెట్ అవ్వలేదు. విగ్గు లేకుండా ఒరిజినల్ హెయిర్‌తో దిగిన ఫోటోలే బావున్నాయని అనడంతో ఒప్పుకోక తప్పలేదు అక్కినేనికి.
90వ దశకంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలోని అక్కినేని పాత్ర గురించే ఇదంతా. మానస రాసిన 'నవ్వినా కన్నీళ్లే' నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రచయిత గణేష్ పాత్రో కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా క్రాంతికుమార్ దర్శకత్వంలో దొరస్వామి రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ కథ వినగానే అక్కినేని ఓకే చేయలేదు. దాంతో ఆయన చేయనంటే వేటూరితో తాత పాత్ర వేయిద్దామనుకున్నారు. అంతలో అక్కినేని తానే ఆ పాత్ర వేస్తానన్నారు. తాత పాత్రలో ఒదిగిపోయి నటవిశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.
ఇక మనవరాలి పాత్ర కోసం మొదట గౌతమిని అనుకుని ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. తీరా షూటింగ్ మొదలు పెట్టే సమయానికి ఆమెకు తమిళ సినిమాలో ఓ పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఈ సినిమా వదులుకున్నారు. అప్పుడు ఆ పాత్ర మీనాను వరించింది. అక్కినేని మనవరాలిగా మీనా ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించింది.
కథపై ఎన్నో ఆశలతో సినిమా తీసిన దర్శక నిర్మాతలకు మొదటి వారం నిరాశ ఎదురైంది. కలెక్షన్లు లేవు. మంచి కథను ప్రేక్షకులు ఆదరించలేదని మదన పడ్డారు. కానీ అనూహ్యంగా రెండో వారం నుంచి కలెక్షన్ల వేగం పుంజుకుంది. పెద్ద హిట్ అయింది. ఈ చిత్ర విజయోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com