Anasuya Bharadwaj: అవి నచ్చకే షో వదిలేశాను: అనసూయ భరద్వాజ్
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్‌ను యాంకర్ అనసూయగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది జబర్దస్త్ అనే షో. ఎక్కువకాలం ప్రసారమైన తెలుగు స్టాండప్ కామెడీ షోగా ఇప్పటికే జబర్దస్త్ రికార్డు సాధించింది. అయితే ఈ షో నుండి అనసూయ తప్పుకోవడం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. అసలు అనసూయ ఎందుకు ఈ షో నుండి తప్పుకుంది అనే ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం దొరకలేదు. ఇక తాజాగా మొదటిసారి దీనిపై స్పందించింది అనసూయ.
తెలుగులో చాలా క్రేజ్ ఉన్న యాంకర్లు తక్కుమంది ఉన్నారు. అందుకే ప్రతీ ఛానెల్‌లో వచ్చే షోలలో వీరే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి బిజీ యాంకర్లలో అనసూయ ఒకరు. అయితే ఒకవైపు సినిమాలు, మరోవైపు ఇతర షోలు మ్యానేజ్ చేసుకోలేక అనసూయ జబర్దస్త్‌ను వీడిందని ప్రచారం సాగింది. కానీ దీని వెనుక అసలు కారణం వేరే ఉందని అనసూయ స్పష్టం చేసింది.
దాదాపు రెండేళ్ల నుండి షో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పి ప్రేక్షకులకు షాకిచ్చింది అనసూయ. చాలా సందర్భాల్లో తనపై వేసే పంచులు నచ్చక సీరియస్ రియాక్షన్స్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. తనకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు లాంటివి నచ్చవని తేల్చిచెప్పింది. పంచులు నచ్చక మొహం మాడ్చుకున్నట్టు పెట్టినా అది షోలో చూపించరని క్లారిటీ ఇచ్చింది అనసూయ.
క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇవన్నీ తప్పవు కానీ తాను మాత్రం ఆ ఊబిలో చిక్కుకోవాలని అనుకోవడం లేదని అంటోంది అనసూయ. ఈ విషయంలో తాను చాలా పోరాడానని చెప్పింది. జడ్జిలు వెళ్లిపోయారనే అనసూయ కూడా వెళ్లిపోయింది అని ప్రేక్షకులు అనుకోవడంపై కూడా తాను స్పందించింది. తానేం గొర్రెల మంద టైప్ కాదని సమాధానమిచ్చింది. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నానంటూ అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానంతో క్లారిటీ ఇచ్చేసింది అనసూయ భరద్వాజ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com