తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిలో ఆనంద్‌సాయి ఎలా పడ్డాడు?

సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆనంద్ సాయి... సినీ పరిశ్రమకి రాకముందు కొంతకాలం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో పనిచేసిన ఆనంద్ సాయి.. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రంతో ఆర్ట్ డైరెక్టర్ గా మారిపోయారు. ఈ సినిమా చివర్లో వచ్చే ఓ పాటలో సముద్రతీరాన.. అయన వేసిన తాజ్ మహల్ సెట్ అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా చిత్రాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి ఎన్నో అవార్డులను అందుకున్నారు.
ఇక ఇదిలావుండగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి నిర్మాణానికి ఆనంద్ సాయి డిజైనర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆ ఆలయ నిర్మాణానికి ఆనంద్ సాయినే సీఎం కేసీఆర్ ఎందుకు నియమించారు? సీఎం కేసీఆర్ దృష్టిలో ఆనంద్‌సాయి ఎలా పడ్డాడు ? ఇలాంటి అనేకమైన ఆసక్తికర ప్రశ్నలకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు ఆనంద్ సాయి.
"ఎవడు చిత్రం తర్వాత నేను నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాను... ఆ సమయంలో చిన్నజీయర్ స్వామివారి నుంచి పిలుపొచ్చింది. శంషాబాద్‌లో ఉన్న ఆయన ఆశ్రమం ప్రాజెక్టు డిజైన్లు చేయమని నాకు చెప్పారు. అక్కడ కొన్ని డ్రాయింగ్స్ గీసి ఇస్తే.. అవి చూసిన ఆయన.. ఆ ప్రాజెక్టు నన్నే చేయమన్నారు. ఆయన అలా అనేసరికి నేను డైలమాలో పడ్డాను.. దీనితో కొద్దిగా సమయం కావాలని అడిగాను. ఇదే విషయాన్ని నా భార్య వాసుకీతో చెప్తే నీకేది అనిపిస్తే అది చెయ్ అంటూ ప్రోత్సహించింది.
ఆ తరవాత దానికి ఒకే చెప్పి చినజీయర్ స్వామివారితో కలిసి రెండున్నరేళ్లు దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ తిరిగాను.. ముఖ్యంగా ఒడిశాలో ఉండే పద్మవిభూషణ్ గ్రహీత స్థపతి రఘునాథపాత్రోగారి దగ్గర కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. ఇది జరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి ఫోన్ వచ్చింది. యాదాద్రి టెంపుల్‌కు వర్క్ చేయాలని సీఎం చెప్పారు. అప్పటివరకు నేను పరిశీలించిదంతా వైష్ణవ దేవాలయాల గురించే కాబట్టి వెంటనే ఒప్పుకొన్నా.
కేసీఆర్ గారిని కలిసే ముందు కొన్ని డిజైన్లు గీసుకుని వెళ్లి.. అక్కడ ఆయనికి చూపిస్తే... " నా మదిలో కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి, మీరు యాదాద్రిని డిజైన్ చేయండి" అని చెప్పారు.. అలా యదాద్రి టెంపుల్ కి మొత్తం 4 వేల డిజైన్స్ ఇచ్చాను" అని ఆనంద్ సాయి వెల్లడించారు.
ఇక యాదాద్రి ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎం కేసీఆర్ తనని చాలా సార్లు అభినందించారని అన్నారు. ఆనంద్ మంచి ఆర్టిస్ట్, ఆయన్ను మనం బాగా వినియోగించుకోవాలని పలుమార్లు అన్నట్టుగా ఆనంద్ సాయి వెల్లడించాడు. కేసీఆర్ తనకోక దేవుడిలాగా అనిపిస్తారని చెప్పుకొచ్చారు. యాదాద్రి మొత్తాన్ని అయన ఎక్కడ కూడా రాజీపడకుండా కట్టించారని తెలిపారు. ఆలాగే భద్రాచలం టెంపుల్ కూడా డిజైన్ చేయమని తనకి కేసీఆర్ చెప్పినట్టుగా వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com