భానుప్రియ డ్యాన్స్ చేస్తుంటే ఆమె పాదాల్లోని రిథమ్ ను గమనించి ఆశ్చర్యపోయిన చిరంజీవి..

భానుప్రియ డ్యాన్స్ చేస్తుంటే ఆమె పాదాల్లోని రిథమ్ ను గమనించి ఆశ్చర్యపోయిన చిరంజీవి..
తొలి సినిమాతోనే అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. అలా మొదలైన ప్రస్థానం ఓ పదిహేనేళ్ల పాటు హీరోయిన్‌గా,

చారడేసి కళ్లు.. ముత్యాలు రాలుతున్నాయా అనిపించే నవ్వు.. రంగు తక్కువే కానీ.. చెంగున దుంకే లేడిని తలపిస్తుంది. తెలుగు తెరపై సితారలా మ్రోగి.. స్వర్ణకమలమై మెరిసిన ఆ సోయగం భానుప్రియ. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన భానుప్రియ నాటి స్టార్ హీరోలందరి సరసనా నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మదర్ క్యారెక్టర్లతో సెంటిమెంట్ పండిస్తోన్న భానుప్రియ పుట్టిన రోజు నేడు.

భానుప్రియ పుట్టింది రాజమండ్రిలో. చిన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. పదిహేడేళ్ల వయసులో 'మెల్ల పేసుంగ' అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత తెలుగులో వంశీ రెండో సినిమాగా వచ్చిన 'సితార'తో పరిచయమైంది. తొలి సినిమాతోనే అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. అలా మొదలైన ప్రస్థానం ఓ పదిహేనేళ్ల పాటు హీరోయిన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేటి వరకు తన నట ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది.

సితార తర్వాత వంశీ, భానుప్రియ కాంబినేషన్ కు ఆ రోజుల్లో భారీ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా వీరి సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచేవి. అలాగే వంశీ కూడా భానుప్రియను అందంగా చూపించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. దీంతో ఈ కాంబినేషన్ లో సినిమా అంటే చాలు ప్రేక్షకులు ముందే హిట్ అని ఫిక్స్ అయిపోయేవారు.

భానుప్రియ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే టైమ్ కు టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణల హవా బాగా నడుస్తోంది. ఇద్దరూ పోటా పోటీ హిట్లతో దూసుకుపోతున్న టైమ్ అది. భానుప్రియలోని గ్రేస్ తొలి సినిమాతోనే తెలిసిపోవడంతో ఈ బ్యూటీకి ఈ ఇద్దరు హీరోలూ ఓటేశారు. వీరి సినిమాల్లో ఉండే ఫాస్ట్ బీట్ డ్యాన్సుల్లో సత్తా చూపించి.. ఆ ఇద్దరి హిట్లనూ తన ఖాతాలో వేసుకుంది.

చిరంజీవి ఎంత పెద్ద డ్యాన్సర్ అనేది అందరికీ తెలుసు. అలాంటి చిరు కూడా భానుప్రియ డ్యాన్స్ చేస్తుంటే ఆమె పాదాల్లోని రిథమ్ ను గమనించి ఆశ్చర్యపోయేవాడట. అప్పటికే క్లాసికల్ డ్యాన్స్ తెలిసిన హీరోయిన్లు చాలామంది ఉన్నా.. భానుప్రియలోని గ్రేస్ ను అందుకోవడం అందరికీ సాధ్యం కాదని ఆమె డ్యాన్సులు ఎప్పుడు చూసినా అర్థమైపోతుంది.

ఇక భానుప్రియ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో సూపర్ హిట్లు చాలానే ఉన్నాయి. విజేత, జేబుదొంగ, దొంగమొగుడు, ఖైదీ నెంబర్ 786, స్టేట్ రౌడీ... ఇలా చాలా హిట్లే ఉన్నాయి. రాధిక, రాధ తర్వాత చిరంజీవితో హిట్ పెయిర్ అంటే ఆ రోజుల్లో భానుప్రియనూ చెప్పేవారు. ఇక డ్యాన్సుల్లో అయితే ఇద్దరూ పోటీ పడి మరీ నర్తించేవారు.

భానుప్రియ మంచి నటి అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇటు గ్లామర్ తో పాటు అటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ అద్భుతంగా రాణించింది. అంతేకాదు, ఫలానా హీరోలతోనే చేయాలనే కండీషన్స్ కూడా ఏం లేవు. సీనియర్ హీరోల నుంచి అప్పుడే ఎదుగుతున్న జూనియర్ హీరోల వరకూ కథ నచ్చితే చాలు.. కమిట్ అయిపోయింది. అందుకే భానుప్రియ ఖాతాలో మంచి సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

నటిగా తమిళ సినిమాతో అరంగేట్రం చేసినా ఎక్కువ హిట్స్ ఉండటంతో భానుప్రియ తెలుగుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అయినా అడపాదడదా అటు తమిళంతో పాటు కొన్ని హిందీ, మళయాల, కన్నడ సినిమాల్లోనూ కదం తొక్కింది. అయితే ఓ పదేళ్ల పాటు తెలుగులో విజయవిహారం చేసిన తర్వాతే తమిళ పరిశ్రమపై ఎక్కువ దృష్టిపెట్టింది భానుప్రియ.

భానుప్రియ అంటేనే క్లాసికల్ డ్యాన్సులు అన్నంతగా ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్.. అందుకే భానుప్రియ ఆ తరహా డ్యాన్సులు ప్రధాన పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా టాలీవుడ్ లోనే ఓ ఆణిముత్యంగా నిలిచింది స్వర్ణకమలం. ఆ చిత్రంలో అంతా తానై నట విశ్వరూపం చూపించింది భానుప్రియ. అల్లరి పిల్ల నుంచి మెచ్యూర్డ్ విమన్ వరకూ నటనలో పలికించిన వేరియేషన్స్ అన్నీ ప్రేక్షకులను మైమరిపించాయి.

కె.విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన స్వర్ణకమలంలో కెరీర్ లో తొలి ఫిల్మ్ ఫేర్ తొలి నందిని అందుకుంది భానుప్రియ. సినిమాలపై మోజుపడి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా ప్రదర్శించడానికి ఇష్టపడని అమ్మాయిగా భానుప్రయ నటనకు ఫిదా కాని వారు ఉండరు. హీరోగా చేసిన వెంకటేష్ ను సైతం డామినేట్ చేసేలా ఉంటుందామె నటన.

ఇక తమిళ చిత్రం దళపతిలో భర్తను కోల్పోయి మళ్లీ పెళ్లి చేసుకునే పాత్రలో భానుప్రియ పాత్రకు డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అన్ని భావాలూ కళ్లతోనే పలికించాలి. మరి క్లాసికల్ డ్యాన్సర్ అయిన భానుప్రియకు అదేమంత కష్టం. అయితే.. ఆ పాత్రకు తగ్గట్టుగా బిడియం, మొహమాటం... వంటి ఫీలింగ్స్ ను భానుప్రియ పలికిస్తున్నప్పుడు అద్భుతం అనకుండా ఉండలేం.

అలాగే తొలినాళ్లలో రొమాంటిక్ హీరోయిన్ గా అదరగొట్టిన భానుప్రియ ఆపై దేవత పాత్రల్లోనూ దైవత్వాన్ని ప్రదర్శించింది. అన్నమయ్య నుంచి మొదలై ఆ తర్వాత చాలా సినిమాల్లో ఇలవేలుపుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం గ్లామర్ పంచే హీరోయిన్ గా మొదలైన భానుప్రియ ప్రస్థానం ఓ గొప్ప నటిగా ఎదుగుతూ వచ్చిందనుకోవచ్చు.

ఏ హీరోయిన్ కైనా కొంత కాలం తర్వాత ఆ పోస్ట్ కు బ్రేక్ పడుతుంది. భానుప్రియ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. మధ్యలో కొన్ని టీవీ సీరియల్స్ లో నటించినా.. వైవాహిక బంధం కూడా తెగిపోయిన తర్వాత మళ్లీ వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాది భాషల్లో ఇప్పటి కుర్ర హీరోలకు అమ్మగా ఆకట్టుకుంటోంది. ఛత్రపతిలో ఆమె నటన ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది.

ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన కూచిపూడి, భరతనాట్యంలను నలుగురికీ నేర్పించాలనే తలంపుతో ఓ స్కూల్ రన్ చేస్తోంది. అవకాశాలను బట్టి ఇటు వెండితెర, అటు బుల్లితెరలపై తళుక్కుమంటూ తన ప్రతిభను చూపుతోంది.

భానుప్రియ అంటే మన అమ్మాయి తెలుగు వారు ఎంతలా అనుకుంటారో తమిళులూ అలాగే అనుకునేలా అక్కడా ఇమేజ్ సంపాదించింది. అందుకే ఎక్కువగా తమిళ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. కొంతకాలంగా తెలుగులో భానుప్రియకు అవకాశాలు తగ్గాయి. అవతారం తర్వాత ఆమె స్థాయికి తగ్గ పాత్ర రాలేదు. ఇప్పటికే దిగుమతి చేసుకున్న అమ్మలతోనో లేక భాషపై కమాండ్ లేని మమ్మీలతోనూ తెలుగు పరిశ్రమ బిజీగా ఉంది కాబట్టి భానుప్రియకు పెద్దగా ఛాన్సులు రావడం లేదనేవారూ ఉన్నారు.

భానుప్రియకు మరోసారి బర్త్ డే విషెస్ చెబుతూ ఇదీ ఇవాల్టి ఫేవరెట్ ఫైవ్.. మళ్లీ రేపటి ఫేవరెట్ ఫైవ్ లో కలుసుకుందాం..

Tags

Read MoreRead Less
Next Story