లక్కీ ఛాన్స్ కొట్టేసిన అరియానా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో టాప్ ఫైవ్‌లో నిలిచిన అరియానా సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ రోజు జీవితంలో చాలా మంచి రోజు అని తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది.
ఇంతకీ ఆమె ఆనందానికి కారణం ఏమిటి.. ఏదైనా సినిమాలో ఆఫర్ వచ్చిందేమో.. అవును నిజమే.. అయితే ఆ ఆఫర్ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ.. అన్నపూర్ణ బ్యానర్‌లో వస్తే అరియానా ఆనందానికి అంతేముంటుంది మరి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో, యాంకర్ అరియానా తన వ్యక్తిత్వంతో, ఫైటింగ్ స్పిరిట్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అందుకే టాప్ 5కు చేరుకుంది. అంతకు ముందు అరియానా వివిధ రకాల ఫీల్డులతో పాటు యాంకరింగ్ రంగంలో ఉన్నా సరైన గుర్తింపు రాలేదు. కానీ ఆర్జీవీ ఇంటర్వ్యూతో అరియానా అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ నుండి బిగ్‌బాస్ ఆఫర్, ఆ తర్వాత అరియానా ఎవరో అందరికీ తెలిసి పోయింది. ఆమె తెలుగు ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు మరో అదృష్టం అమ్మడి తలుపు తట్టింది. అదే ఓ సినిమాలో అవకాశం. అరియానా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఒక చిన్న సూచన ఇచ్చింది.

అందులో ఏం రాసిందంటే..
హీరో రాజ్ తరుణ్, దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి (సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలు ఫేమ్) లతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. త్వరలో ఓ మంచి వార్త చెబుతానని రాసుకొచ్చింది. బిగ్ బాస్ కాకుండా నా జీవితంలో ఒక మంచి రోజు ఇది. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గవిరెడ్డికి, రాజ్ తరుణ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది అరియానా. హ్యాష్‌ట్యాగ్‌తో అన్నపూర్ణ బ్యానర్‌ను కూడా జోడించింది. సో.. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది. అరియానా అన్నపూర్ణ బ్యానర్‌లో.. రాజ్‌తరుణ్ హీరోగా, అరియానా హీరోయిన్‌గా ఓ చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com