పాటల పూదోటలో విరిసిన కుసుమం 'సినారె'

పాటల పూదోటలో విరిసిన కుసుమం సినారె
సూదిపోట్లకు గుండెచాచి, బాధలకు భాష్యాలు రాసి ఎంత చేదును మింగెనో ఇంత పలుచటి జీవితం అంటారు సి. నారాయణరెడ్డి.

సూదిపోట్లకు గుండెచాచి, బాధలకు భాష్యాలు రాసి ఎంత చేదును మింగెనో ఇంత పలుచటి జీవితం అంటారు సి. నారాయణరెడ్డి. గేయ కవితను చెప్పడంలో సినారెది ప్రత్యేక శైలి. మబ్బులో ఏముంది అని ప్రశ్నించినా.. నన్నుదోచుకుందువటే వన్నెల దొరసానీ అని నిలదీసినా అది నారాయణ రెడ్డికే చెల్లింది. వచన కవిత్వం అల్లినా.. సినీ గీతాలు రాసినా .. తెలుగు గజల్స్ ఆలపించినా.. ఆయన పాళీ ప్రత్యేకం.. సినారె సాహితీ సుధలతో తెలుగు సినిమా పాట, సాహిత్యం అజరామరమైంది. తెలుగు'ధనా'న్ని నలుచెరలా వ్యాపింపచేసిన సాహితీ స్రష్ట పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి.

ఉర్దూ మీడియంలో చదువుకుని తెలుగును ఆప్షనల్ గా తీసుకుని.. అటుపై తెలుగులో ఎన్నో ప్రయోగాలు చేసిన మహా రచయిత సి.నారాయణరెడ్డి. సినారెగా చిరపరిచితులై సాహితీ లోకంలో శిఖర సమానమై వెలిగారు. ఆయన పేరు వినగానే చాలామంది సినీకవిగానే భావిస్తారు. కానీ తెలుగు సాహిత్యంలో ఆయన చేయని ప్రయోగం లేదు. రాయని ప్రక్రియా లేదు. ఉర్ధూకు, హిందీకే పరిమితమైన గజల్స్ గానామృతాన్ని తెలుగులో పంచింది కూడా ఆయనే.

కవితలు, గేయాలు, పద్యాలు, పద్యకావ్యాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్యరూపకాలు, బుర్రకథలు, వ్యాసాలు, విమర్శనాత్మక రచనలు.. ఇలా తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో అందెవేసిన కలం సినారెది.. మరి ఈ సాహిత్యం ఆయనకు ఎలా ఒంటబట్టింది..?

సినారె ఇంట్లో అంతకు ముందే సాహితీ వేత్తలున్నారా.. అంటే '' సాహిత్యం నా ఒంటబట్టిందే కానీ, నా ఇంట పుట్టింది కాదు.. అయినా నా వెంటవచ్చింది'' అనేవారు సినారె. అందుకు కారణం.. తాను పుట్టింది స్వచ్ఛమైన పల్లెటూరు.. ఆ ఊరు వారగా పారే యేరు అని ప్రతీసారీ ఇష్టంగా చెప్పుకున్నారు.

సినారె పుట్టింది 1931 జులై 29న కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. ప్రాథమిక విద్య ఊళ్లోనే కొనసాగింది. వారి ఊరికి హరికథలు, జానపదాలు, జంగం కథలు చెప్పడానికి చాలామంది వచ్చేవారట. వారు చెప్పే ఆ పాటలు, మాటలే తనలో సాహితీ తృష్ణను రగిలించాయని చెప్పేవారు. ఆ ప్రేరణతోనే తొలిగా గేయకవితలు రాశారు. ఉన్నత చదువులకు వచ్చాక వాటికి చందోబద్ధమైన అల్లికలు చేసి.. అద్భుతమైన కవిత్వంగా మలచడం మొదలుపెట్టారు.

సినారె సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు చేసినా ఆయన సహజంగా కవి. ఆ కవిత్వమే ఆయన్ని సినీ కవిగా మార్చింది. కవిగాని వాడు సినీ కవి కాలేడు అంటారు. ఆయనకు కూడా పాటంటేనే ఎక్కువ ఇష్టం. ఆ ఇష్టాన్నే ఎన్నితెన్నుల కైత విహరించినను.. పాటలోనే నాదు ప్రాణాలు గలవందు.. అని రాసుకున్నారు. పాట ఆయన ప్రాణం. అందుకే ప్రాణం పోయేవరకూ పాటను వదల్లేదు. పాట కూడా ఆయన్ని వదలడానికి ఇష్టపడలేదు.

కాలేజీ చదివే రోజుల్లోనే సినారెకు సినిమా కవిత్వంపై మక్కువ ఏర్పడింది. ఆ మక్కువను ఊరికే ఉంచక.. హిందీ పాటల్లోని బాణీలకు తానైతే ఆ పాట ఎలా రాస్తానా అనే ఊహను జోడించి.. తెలుగులో రాసుకునేవారట.. అలా తొలినాళ్లలో ఆయన రాసుకున్న పల్లెటూరులే భారత భూమికి బంగరుటేరుల ఊటలురా, పల్లెటూరులే ప్రపంచ మానవ కళ్యాణానికి బాటలురా.. వంటివి ఆ తర్వాత రోజుల్లో ఆయనకు ఏర్పడ్డ అభ్యుదయ భావాలకు అద్దం పడతాయి..

మరో విశేషం ఏంటంటే.. సినారె గారు కాలేజ్ లో చదువుకునే రోజుల్లో 'సినీకవి' అనే ఓ నాటకం రాసి ప్రదర్శించారు. ఆశ్చర్యంగా ఆ నాటికలో సినీకవి వేషం వేసింది ఆయనే. ఆ నటన కాస్తా జీవితంలోకీ అన్వయమై.. అటుపై తెలుగు సినిమాపాటకు ఓ మకుటం లేని సాహితీ శిఖరంగా నిలిచింది.

నన్నుదోచుకుందువటే అనే పాటతో మొదలైన సి.నారాయణరెడ్డి సినీకవితా ప్రస్థానం 3500 పాటలకు పైగా కొనసాగింది. ఆయన సినీ కవిగా మారకముందే రాసిన కొన్ని గేయాలు.. అనుకోకుండా సినీ పాటల్నీ తలపిస్తాయి. అందుకే ఆ కాలంలో ఆయన ఆకాశవాణి కోసం రాసిన కొన్ని పాటల్ని ఏ మార్పులూ లేకుండా సినిమాల్లోనూ ఉపయోగించుకున్నారట. వాటిలో ఈ నల్లని రాళ్లలో , మబ్బులో ఏముందీ నా మనసులో ఏముందీ, తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది,ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ వంటి పాటలెన్నో ఉన్నాయి..

నాటి మేటి అగ్రనటులు, సంగీత దర్శకలు, దర్శకులు, నిర్మాతలందరికీ అభిమానపాత్రుడైన కవిగా ఆయన సృజించిన సాహితీ సౌరభాలెన్నో చెప్పడం కష్టం. ఇటు సినిమా పాటలు రచిస్తూనే సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్ధూ, కన్నడం, ఫ్రెంచ్ మొదలైన భాషల్లోనూ అనేక గ్రంథాలు అనువాదం చేశారు. హిందీ, ఉర్ధూ భాషల్లో కవితలు రాశారు.

సమకాలీన సమస్యలపైనా సినారె కలం కదం తొక్కింది. ఏ భావజాలానికి కట్టుబడని వాడైనా అవసరాన్ని బట్టి తన కలంతో అగ్నిధారలు కురిపించారు. ఆ క్రమంలోనే ఒక కవిగా స్పందించి కణకణమండే అభ్యుదయ గేయాలెన్నో రచించారు. అందుకే ఎన్ని యుగాలైనా ఇగిరిపోని కవితా సుమగంధం సినారె.

చాలామంది కవులు సినిమా కవులు కాకముందు ఏదో ఒక భావజాలంతో ముడివేసుకుని నిబద్దతతో ఉన్నారు. కానీ వారు సినిమా కవులుగా మారాక అనేక రకాలుగా మారిపోయారు. సినారె అందుకు మినహాయింపు. ఓ కవిగా తను సినిమా రంగంలో ఎలా అడుగుపెట్టాడో.. అలాగే ఆఖరి వరకూ అలాగే ఉన్నారు. ఎన్నో ఇజాలకు సంబంధించిన పాటలు రాసినా.. ఏ ఇజానికీ లొంగలేదు.. లోను కాలేదు.

విరహ, వీరోచిత, స్నేహగీతాలే కాదు.. జోల పాటలూ లాలి పాటలూ రాశారు. అమ్మను మించి దైవం లేదంటూనే కంటేనే అమ్మకాదు కడుపు తీపిలేని చోట అమ్మదనం ఉండదనీ ఖరాకండీగా చెప్పారు. ప్రేమతరంగాలు నిండిన నవజీవన రాగాలతో నవకవితాలోకానికి రారాజులా వెలిగారు సినారె.

కవిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సినారె పలు పదవుల్లోనూ కొనసాగి వాటికీ వన్నె తెచ్చారు. 1977లో పద్మ పురస్కారాన్ని అందుకున్న సినారె.. 1978లో కళాప్రపూర్ణ, 1988లో విశ్వంభర కావ్యానికిగానూ ప్రఖ్యాత జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని పొందారు. 1997లో రాజ్యసభ సభ్యుడిగానూ ఎంపికయ్యారు.

తన రచనలతో తెలుగు సాహితీ, సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసి.. సినారెగా సాహితీలోకంలో తనదైన ముద్ర వదిలి 2017 జూన్ 12న ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పారు సి నారాయణరెడ్డి. భౌతికంగా లేకపోయినా తను పంచిన సాహితీసౌరభాలతో తెలుగునేల నలుచెరగలా నిత్యం పరిమళిస్తూనే ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story