Chandan Kumar: తెలుగు సీరియళ్ల నుండి ఆ నటుడు ఔట్.. జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం..

Chandan Kumar: మామూలుగా సినిమాల, సీరియళ్ల సమయంలో చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం. కానీ అతి తక్కువ సందర్భాల్లోనే ఆ మనస్పర్థలు పెద్ద గొడవ లాగా మారుతాయి. ఇటీవల ఓ సీరియల్ షూటింగ్‌లో నటుడు, అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య జరిగిన గొడవ.. ఆ సీరియల్ హీరో కెరీర్‌పైనే ఎఫెక్ట్ చూపించింది. తనకు తెలుగు సీరియళ్ల నుండి జీవితకాలం నిషేధం విధించేలా చేసింది.
ఇప్పటికే చాలామంది కన్నడ నటీనటులు తెలుగు సీరియళ్లలో నటిస్తున్నారు. అందులో ఒకరే చందన్ కుమార్. 'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు చందన్ కుమార్. ప్రస్తుతం 'శ్రీమతి శ్రీనివాస్' అనే సీరియల్‌లో లీడ్ యాక్టర్‌గా చేస్తున్నాడు. ఈ సీరియల్ షూటింగ్ సమయంలో చందన్‌కు, అసిస్టెంట్ డైరెక్టర్ రంజిత్‌కుమార్ జరిగిన వాగ్వాదం సంచలనంగా మారింది. ఆ సందర్భంలో వీరిద్దరు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు కూడా.
ఈ విషయంపై తెలుగు సీరియల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాని సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం దాదాపు 240 మంది కన్నడ నటులు తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్నారు. కానీ ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదని ఆయన వివరించారు. అందుకే చందన్ కుమార్‌కు జీవితకాలం తెలుగు సీరియల్స్ నుండి నిషేధం విధిస్తున్నట్టు నాని ఓపెన్‌గా ప్రకటించారు. 21 సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com