Cinema: నిజమైన 'సార్' ను కలసిన వెంకీ అట్లూరి

Cinema: నిజమైన సార్ ను కలసిన వెంకీ అట్లూరి
బాలగంగాధర్ పాత్రను పోలిన మాస్టర్ ను కలసిన దర్శకుడు వెంకీ అట్లూరి; కొమరంభీమ్ జిల్లాకు చెందిన కేడార్ల రంగయ్యకు చిరు సత్కారం

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ సినిమా వందకోట్ల వసూళ్లు రాబట్టుకునే దిశగా పయనిస్తోంది. ఇక బాల గంగాధర్ తిలక్ పాత్ర ఉపాధ్యాయులకు స్పూర్తిగా నిలుస్తోందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి నిజ జీవిత బాల గంగాదర్ తిలక్ ను కలసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమాలో అచ్చంగా సార్ పాత్రలను పోలిన ఉపాధ్యాయుడి గురించి విన్న దర్శకుడు ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం సావర్ ఖేడలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న కేడర్ల రంగయ్య జీవితగాథ అచ్చంగా తిలక పాత్రను పోలి ఉండటం కేవలం యాధృశ్చికమే.

ఉపాధ్యాయుడిగా రంగయ్య బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 60 ఉండగా, ఆయన కృషితో ఆ సంఖ్యను 260కి చేర్చారు. తన కుమార్తెను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి.. తన బాటలోనే ఆ గ్రామస్థులు నడిచేలా వారిలో స్ఫూర్తి నింపారు. తన సొంత డబ్బుతో పాఠశాలను మరమ్మత్తులు చేయించడానికి పూనుకున్న ఆయనను చూసి గ్రామస్థులు ముందుకొచ్చి పాఠశాలకు కొత్త మెరుగులు దిద్దారు. ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన కృషికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.

ఇక తాను రాసుకున్న బాల గంగాధర్ తిలక్ పాత్రను పోలిన ఉపాధ్యాయుడు నిజంగానే ఉన్నారని తెలిసి వెంకీ అట్లూరి ఆశ్చర్యపోయారు, అంతకుమించి ఆనందపడ్డారు. రంగయ్యను కలసి సార్ చిత్రం గురించి, సావర్ ఖేడ ప్రభుత్వ పాఠశాల గురించి ఎన్నో విషయాలు చర్చించారు. పేద విద్యార్థుల కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఆయనకు చిత్ర బృందం తరఫున రు. 3 లక్షలు ఆర్ధిక తోడ్పాటు అందించారు.

Tags

Read MoreRead Less
Next Story