Gummadi Narsaiah: 'గుమ్మడి నర్సయ్య' బయోపిక్ నుంచి పాట విడుదల

ఈ మధ్యకాలంలో బయోపిక్ సినిమాలపై ఆడియన్స్ ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎన్టీఆర్, జయలలిత,వైఎస్‌ఆర్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు జీవిత చరిత్రలను బయోపిక్ రూపంలో తీసి ప్రజల వద్దకు తీసుకు వస్తున్నారు. అయితే ఉన్నది ఉన్నట్టుగా తీశారా? ఏమైనా అదనంగా చూపిస్తున్నారా? అసలు వాస్తవాలు బయటకు చూపిస్తారా? అనే ఆలోచనలతో జనాలు బయోపిక్ సినిమాలను చూస్తుంటారు. ఈ క్రమంలోనే అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిది అయిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రజల కోసం ప్రజల కొరకే నా జీవితం అంటూ ముందుకు సాగిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలిచేలా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ వెల్లడిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. గుమ్మడి నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృదం ప్రకటించింది.
ఈ మేరకు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలె మాట్లాడుతూ.. ఈరోజు గుమ్మడి నర్సయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశామన్నారు. ప్రేక్షక మహాశయులు అందరూ చూసి మా చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామని తెలిపారు. బయోపిక్ కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చాలా శ్రద్దగా, నిదానంగా సినిమాను తీస్తున్నామని వెల్లడించారు. ఇకపై సినిమాకు సంబంధించిన అప్డేట్లను రెగ్యులర్‌గా ఇస్తామని తెలిపారు.
అయితే చరణ్ అర్జున్ అందించిన బాణీ, పాడిన తీరు పాటను వినసొంపుగా మార్చిందని మేకర్స్ అంటున్నారు. గుమ్మడి నర్సయ్య వ్యక్తిత్వం, మంచితనం, గొప్పదనం తెలిసేలా రాసిన పాట శ్రోతలను కదిలించేలా ఉందన్నారు. ఈ పాటతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా ఉంది. ఈ పాట త్వరలోనే అందరి నోట వినిపించేలా కనిపిస్తోందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com